గత కొన్ని సంవత్సరాలుగా టీం ఇండియా అన్ని ఫార్మాటుల్లోనూ అద్భుతమైన ప్రదర్శనే కనపరుస్తోంది. సొంత గడ్డపై  ఏ మ్యాచ్ లోనైనా విజయం టీమిండియాకే దక్కుతోంది. విదేశాల్లోనూ బాగానే రాణిస్తున్నారు. అయితే... ఐసీసీ టోర్నీల్లో మాత్రం విఫలమౌతున్నారు. టీ20 ప్రపంచకప్ తోలి టోర్నీ తర్వాత మళ్లీ టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచింది లేదు. 2013 తర్వాత ఛాంపియన్స్ ట్రోపీ కూడా గెలవలేదు. ఈ విషయంలో అభిమానులు కూడా నిరాశలో ఉన్నారు.

ఇలా ఐసీసీ టోర్నమెంట్స్ లో భారత్ వెనకపడటానికి సరైన జట్టు ఎంపిక చేయకపోవడం కూడా ఒక కారణమనే వాదనలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు బీసీసీఐ పాలన సీఓఏ చేతుల్లో ఉండటంతో టీం ఇండియా ప్రదర్శన గురించి సమీక్షించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అంతా కెప్టెన్ విరాట్, కోచ్ రవిశాస్త్రి మాత్రమే చూసుకోవాల్సి వచ్చేది. కనీసం వాళ్లని ప్రశ్నించే పరిస్థితి కూడా ఎవరికీ ఉండేది కాదు.

అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఏకగ్రీవం అయ్యాడు. ఈ నెల 23వ తేదీన ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన టీం ఇండియాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

జట్టు ప్రదర్శన బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తూనే... ఐసీసీ టోర్నీలో జట్టు వైఫల్యాలను కూడా ఎత్తి చూపించాడు. ప్రతి టోర్నీ గెలవాలని కోరుకోలేం కానీ.. వరసగా ఏడు టోర్నీల్లో విఫలమవ్వడంపై మాత్రం దృష్టి పెట్టాల్సిందేనని గంగూలీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ గా ఎంతో అనుభవం ఉన్న గంగూలీ... బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కచ్చితంగా జట్టును మార్గనిర్దేశం చేస్తాడని నిపుణులు చెబుతున్నారు. ప్రతి మ్యాచ్ పైనా, ఆటగాడి ఆటపైన కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సమీక్షలు నిర్వహించినప్పుడు... ఆటగాళ్లు తమ అత్యుతమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ ఇండియా మెగురైన జట్టు.  పెద్ద టోర్నీ గెలిచి టీం ఇండియాకు చాలా సంవత్సరాలు అయ్యిందని నాకు తెలుసు. సెమీఫైనల్స్, ఫైనల్స్ తప్పించి.. మిగిలిన మ్యాచులు బాగా ఆడారు. వీటిపై కెప్టెన్ కోహ్లీ తగిన శ్రద్ధ తీసుకొని పరిస్థితిని మార్చాలి’’ అని గంగూలీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.