అందరూ ఊహించిందే జరిగింది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పై వేటు పడింది. ప్రస్తుతమున్న బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లను అలాగే కొనసాగించిన సెలెక్షన్ కమిటీ బంగర్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో  టీమిండియా మాజీ  ప్లేయర్ విక్రమ్ రాథోడ్ ఎంపికయ్యాడు. 

కొద్దిరోజుల క్రితమే టీమిండియా చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి నియమితులయ్యాడు. ఈ ప్రక్రియను కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ చేపట్టింది. అయితే సహాయ సిబ్బంది నియామక ప్రక్రియను మాత్రం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ చేపట్టింది. టీమిండియా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాలకు కోచ్ లను ఎంపికచేసే బాధ్యత ఈ సెలెక్షన్ కమిటీ తీసుకుంది. 

ఈ మూడు విభాగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గత రెండు రోజులగా సెలెక్షన్ కమిటీ సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఫలితాలను గురువారం రాత్రి ఎమ్మెస్కే ప్రసాద్ అధికారికంగా వెల్లడించాడు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఒక్కడినే మార్చాలని తాము నిర్ణయించినట్లు తెలిపాడు.  బౌలింగ్ కోచ్  భరత్ అరుణ్,  పీల్డింగ్ కోచ్ గా శ్రీదర్ ను యదావిధిగా కొనసాగనున్నట్లు ఎమ్మెస్కే ప్రకటించాడు. అయితే సెలెక్షన్ కమిటీ నిర్ణయానికి బిసిసిఐ ఆమోదం లభించాకే అధికారికంగా వీరు సహాయ కోచ్ లుగా మారతారు. 

ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో  పోరాడి ఓడింది. కీలక సమయంలో కాకుండా ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్ కు పంపడమే ఈ  ఓటమికి కారణమని అభిమానులే కాదు క్రికెట్ పండితులు విశ్లేషించారు. ఇందుకు కారణమయిన బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే ఇప్పుడు అతడి పదవికి కూడా ఎసరు తెచ్చినట్లు సమాచారం. 

ఇక బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్ గా ఎంపికైన రాథోడ్ అంతర్జాతీయ స్థాయిలో ఏడు వన్డేలు, ఆరు టెస్టులు ఆడాడు. గతంలో ఇతడు  టీమిండియా సెలెక్షన్ కమిటీ 
సభ్యుడిగా వున్నాడు. అంతర్జాతీయ జట్లకు కోచ్  గా పనిచేసిన అనఉభవం  లేకున్నా ఐపిఎల్ లో కింగ్స్ లెవెన్, పంజాబ్ రంజీ జట్లకు కోచ్ గా పనిచేసిన అనభవం వుంది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే అతన్ని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ గా ఎంపికచేశారు.