టీమిండియా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. గతంలో అతన్ని జట్టులోకి తీసుకోవాలని కోరిన అభిమానులే ప్రస్తుతం జట్టులోంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు సైతం అతడిపై చర్యలు తీసుకోవాలంటూ బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అతడి వరుస వైఫల్యాలే కారణం. అయితే ఇలా పంత్ పై విమర్శలు కురిపిస్తున్న వారందరికి మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. 

''క్రికెట్ ఆటగాళ్ల కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమే. ఆ విషయం అభిమానులకు తెలియకపోవచ్చు...కానీ మీకేమయ్యింది. పంత్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఇంకా చాలా నేర్చుకోవాల్సి వుంది. అప్పటివరకు కాస్త ఓపికపడితే బావుంటుంది. 

ధోని స్థానంలో పంత్ జట్టులోకి వచ్చాడు కాబట్టి కాస్త ఒత్తిడి వుంటుంది. ధోని కూడా ఒక్కరోజులోనే గొప్ప ఆటగాడిగా మారలేదు. వచ్చిన అవకాశాలను ఒక్కోటిగా సద్వినియోగం చేసుకుంటూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.  అయితే ఆ సమయంలో అతడిపై ఒత్తిడి లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ పై చాలా ఒత్తిడి వుంది. 

ముఖ్యంగా పంత్ ఆటను ధోని ఆటతీరుతో పోల్చడమే పెద్ద సమస్యగా మారింది. దీని కారణంగానే అతడిపై ఒత్తిడి మరింత ఎక్కువవుతోంది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే సత్తా అతడిలో దాగున్నా ఈ ఒత్తిడి కారణంగానే విఫలమవుతున్నాడు. కాబట్టి ఇకనైనా ఈ పోలికను ఆపి పంత్ సహజసిద్దంగా ఆడేలా సహకరించాలి. అప్పటికీ అతడి ఆటలో మార్పు రాకుంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ అలా జరగదని నేను భావిస్తున్నాను. '' అంటూ యువీ పంత్ కు అండగా నిలబడ్డాడు.