టీమిండియా చీఫ్ కోచ్ ఎంపిక సమయంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరు ప్రదానంగా వినిపించింది. రవిశాస్త్రిని తొలగించి సెహ్వాగ్ ను చీఫ్ కోచ్ గా నియమించాలని కపిల్ దేవ్ సారథ్యంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ సెహ్వాగ్ కనీసం ఈ  పదవికోసం దరశాస్తు కూడా చేసుకోలేదు. తాజాగా తాను చీఫ్ కోచ్ పదవిని అసలు ఆశించనేలేదని... తానే ప్రధాన రేసులో వున్నట్లు జరిగిందతా అసత్య ప్రచారమని సెహ్వాగ్ వెల్లడించాడు.

''నేను ఈసారి అసలు టీమిండియా చీఫ్ కోచ్ పదవిని ఆశించలేదు. 2017 లో కూడా నాకు నేనుగా ఈ పదవికి దరఖాస్తు చేయలేదు. ఓ బిసిసిఐ ఉన్నతాధికారి ప్రత్యేకంగా కోరడంతో దరఖాస్తు చేశా. కానీ అప్పుడు ఆ పదవి నాకు దక్కలేదు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ పదవి గురించి నేనసలు ఆలోచించనే లేదు. ఈసారి కూడా ఎవరైనా దరఖాస్తు  చేయమని కోరితే ఆలోచించేవాడినేమో. కానీ అలా ఎవరూ కోరలేదు.'' అని సెహ్వాగ్ వెల్లడించాడు. 

ఇక ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఓటమి, శ్రీశాంత్ పై జీవితకాల నిషేదం ఎత్తివేత తదితర అంశాలపై కూడా సెహ్వాగ్ స్పందించాడు. మేనేజ్ మెంట్ లోపం వల్లే ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఓటమిపాలయ్యిందని ఆరోపించాడు. ముఖ్యంగా ధోనిని ఐదో స్థానంలో  బరిలోకి దించితే ఫలితం మరోలా వుండేదన్నాడు. ఈ నిర్ణయం ఎవరిదైనా జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని సెహ్వాగ్ తెలిపాడు. 

ఇక మ్యాచ్ పిక్సింగ్ ఆరోపణలతో క్రికెటర్ శ్రీశాంత్ కు విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించడం మంచి పరిణామమే అన్నాడు. నిషేధం తర్వాత అతడు మళ్లీ భారత జట్టు  తరపున ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అతడిలో మంచి ప్రతిభ దాగుందని...కొంతకాలమైనా అది టీమిండియాకు ఉపయోగపడితే మంచిదే కదా అని సెహ్వాగ్ పేర్కోన్నాడు.