టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఆదిపత్య పోరు సాగుతున్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా కోహ్లీయే స్పందించి  రోహిత్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని కూడా వివరణ ఇచ్చాడు. అదికూడా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోయింది. దీంతో తాజాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

''ప్రస్తుతం అత్యుత్తమ ఆటతీరుతో దూసుకుపోతున్న భారత జట్టును ఇలాంటి తప్పుడు వార్తలు తీవ్రంగా దెబ్బతీస్తాయి. సీనియర్ ఆటగాళ్ల పై జరుగుతున్న ఈ ప్రచారం మిగతా జట్టుసభ్యులను మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే జట్టులో  చేరే యువకులపై ప్రభావం చూపనుంది. జట్టులో నిజంగానే రెండు వర్గాలున్నట్లు వారు బ్రమపడి గందరగోళానికి గురయ్యే అవకాశముంది. 

ఇప్పటికే కోహ్లీ తనకు రోహిత్ తో ఎలాంటి విబేధాలు లేవని విరవణ కూడా ఇచ్చాడు. అయినా కూడా కొన్ని మీడియా సంస్థలు ఇంకా వారిద్దరి మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లుగానే ప్రచారం చేస్తున్నాయి. వారికి ఇది మంచి టీఆర్పీని తెచ్చిపెట్టవచ్చు. కానీ భారత జట్టుకు అదెంతో చేటు చేస్తుంది.

క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఈ  ప్రచారం ఆగిపోతుంది. ఎందుకంటే మ్యాచ్ కు సంబంధించిన వార్తలు వుంటాయి కాబట్టి వాటిపై దృష్టి పెడతారు. అయితే ఎలాంటి మ్యాచ్ లు లేనపుడే ఇలాంటి విషయాలపై మీడియా దృష్టి సారిస్తుంది. కోహ్లీ, రోహిత్ లు భారత జట్టులో కొనసాగినన్ని రోజులూ వారిద్దరి మధ్య విబేధాలున్నట్లు కథనాలు వస్తూనే వుంటాయి. వాటిని అభిమానులెవరూ పట్టించుకునే అవసరం లేదు.'' అని గవాస్కర్ పేర్కొన్నారు.