INDvsAUS 2nd Test: టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ పేలవ ఫామ్  కొనసాగుతోంది.  తొలి టెస్టులో దారుణంగా నిరాశపరిచిన ఈ కొత్త పెళ్లికొడుకు.. ఢిల్లీ టెస్టులోనూ  అదే ఆటతీరుతో  విఫలమయ్యాడు. 

భారత క్రికెట్ జట్టుకు టెస్టులలో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టులలో పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కీలకమైన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అతడు వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. నాగ్‌పూర్ టెస్టులో 20 పరుగులే చేసిన రాహుల్.. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా 17 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో అతడిపై టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ ను ఆడించడమంటే అది దేశంలో బ్యాటర్లకు కొదవ ఉందని చెప్పడమేనని మండిపడ్డాడు. 

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ నిష్క్రమించిన తర్వాత వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లతో అతడిపై విరుచుకుపడ్డాడు. రాహుల్ విషయంలో బీసీసీఐ అనుకరిస్తున్న వైఖరిని ప్రసాద్ ఎండగట్టాడు. 

ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఈ వైఫల్యం కొనసాగుతోంది. టీమిండియా మేనేజ్మెంట్ లోపాలను ఇది చూపుతోంది. నాకు తెలిసి గడిచిన 20 ఏండ్లలో భారత క్రికెట్ లో ఇంత తక్కువ సగటుతో ఏ ఆటగాడు ఇన్ని టెస్టులూ ఆడలేదు. టీమ్ లో అతడిని చేర్చడం అంటే న్యాయాన్ని సమాధి చేస్తున్నట్టే ఉంది. టీమిండియా మాజీ ఓపెనర్లు శివ సుందర్ దాస్, శఠగోపన్ రమేశ్ లు గొప్ప సామర్థ్యమున్నా.. వాళ్ల సగటు 38 ప్లస్ గా ఉన్న వారు 23 టెస్టులకే పరిమితమయ్యారు. రాహుల్ కు వరుసగా అవకాశాలివ్వడం చూస్తే భారత్ లో బ్యాటర్లు లేరని చెప్పకనే చెప్పినట్టుగా అర్థమవుతున్నది. గత ఐదేండ్లుగా రాహుల్ 47 ఇన్నింగ్స్ లలో 27 సగటుతో దారుణంగా ఆడుతున్నాడు.... 

కెఎల్ కు ఇచ్చినన్ని అవకాశాలు మరే ఆటగాడికీ ఇవ్వలేదు. ఇది తీవ్రమైన వివక్ష. కెఎల్ రాహుల్ మంచి ఆటగాడే కావొచ్చు గానీ చాలాకాలంగా అతడి ప్రదర్శనలు నాసిరకంగా ఉన్నాయి. ఇప్పుడు గనక అతడు మరో మంచి ఇన్నింగ్స్ ఆడితే రెండేండ్ల దాకా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా గడిపేయొచ్చు... 

Scroll to load tweet…

టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు టాలెంటెడ్ ఆటగాళ్లకు ఛాన్సులివ్వకుండా రాహుల్ వంటి పేలవ ఫామ్ తో ఉన్న ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిస్తున్నారు. శిఖర్ ధావన్ కు టెస్టులలో 40 ప్లస్ సగటు ఉంది. మయాంక్ సగటు 41 ప్లస్. టెస్టులలో అతడు రెండు డబుల్ సెంచరీలు కూడా చేశాడు. శుభ్‌మన్ గిల్ జబర్దస్త్ ఫామ్ లో ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..? చాలామంది దేశవాళీ ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తూ అదరగొడుతున్నా సెలక్టర్లు వారిని పట్టించుకోవడం లేదు....’అని ఫైర్ అయ్యాడు.

Scroll to load tweet…

ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్న కొత్త పెళ్లి కొడుకు రాహుల్ గనక ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇదే ఫామ్ ను కొనసాగిస్తే అతడికి మూడో టెస్టులో చోటు దక్కడం గగనమే అని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.