India vs Afghanistan: ఆఫ్ఘానిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న యువ భారత జట్టు... గ్రూప్ A నుంచి పాకిస్తాన్‌తో పాటు సెమీస్‌కి...

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓడిన యువ భారత జట్టు, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్‌ని చిత్తు చేసింది. టాస్ గెలిచిన యంగ్ టీమిండియా కెప్టెన్ యశ్ దుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. 

ఓపెనర్ సులేమాన్ అరబ్‌జీ 18, మహ్మద్ ఇషాక్ 19 పరుగులు చేసి అవుట్ కాగా అల్లా నూర్ 26 పరుగులు చేశాడు. 101 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. అయితే కెప్టెన్ సులేమా సఫీ, ఇయాజ్ అహ్మద్ అహ్మద్‌జాయ్ కలిసి నాలుగో వికెట్‌కి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

కెప్టెన్ సులేమాన్ సఫీ 86 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 73 పరుగులు చేసి అవుట్ కాగా ఇయాన్ అహ్మద్ అహ్మద్‌జాయ్ 68 బంతుల్లో ఓ ఫోర్, 7 సిక్సర్లతో 86 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆఖర్లో ఖైబర్ వాలి 12 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేయడంతో ఆఖర్లో భారీగా పరుగులు చేయగలిగింది ఆఫ్ఘాన్...

భారత బౌలర్లలో రాజ్‌వర్థన్ హంగవర్కేకర్, రాజ్ భవ, విక్కీ ఓస్వల్, కుశాల్ తంబే తలా ఓ వికెట్ తీశారు. 260 పరుగుల లక్ష్యఛేదనలో భారత జట్టుకి శుభరాంభం దక్కంది. ఓపనెనర్లు అంగ్‌క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నమోదు చేశారు. తొలి వికెట్‌కి 104 పరుగులు జోడించిన తర్వాత 47 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేసిన ఓపెనర్ రఘువంశీ, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

74 బంతుల్లో 9 ఫోర్లతో 65 పరుగులు చేసిన హర్నూర్ సింగ్‌ కూడా నూర్ అహ్మద్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. షేక్ రషీద్ 6 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ యశ్ దుల్ 35 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

నిశాంత్ సింధు 19, వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ 12 పరుగులు చేసి నిరాశపరిచినా రాజ్ భవ, కుశాల్ తంబే కలిసి ఏడో వికెట్‌కి అజేయంగా 65 పరుగులు జోడించి భారత జట్టుకి విజయాన్ని అందించారు. రాజ్ భవ 55 బంతుల్లో 2 ఫోర్లతో 43 పరుగులు చేయగా, కుశాల్ తంబే 29 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...

48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు, గ్రూప్ స్టేజ్‌లో రెండు విజయాలతో సెమీస్‌కి అర్హత సాధించింది. గ్రూప్ A నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్‌కి అర్హత సాధించగా... గ్రూప్ బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు సెమీస్‌కి అర్హత సాధించాయి. 

ఒకవేళ సెమీస్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు విజయాలను అందుకుంటే, ఫైనల్ మ్యాచ్‌లో దాయాదుల పోరు చూసే అవకాశం మరోసారి దొరుకుతుంది.