శుభ్‌మన్ గిల్‌కు టిండర్‌లో ప్రపోజ్‌ల వెల్లువ.. నాగ్‌పూర్‌లో హోర్డింగ్‌లతో రచ్చ రచ్చ
INDvsAUS: ఇండియా - న్యూజిలాండ్ నడుమ ఇటీవల ముగిసిన అహ్మదాబాద్ టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చిన ఓ అమ్మాయి.. గిల్ కు వినూత్న రీతిలో ప్రపోజ్ చేసింది.

గత నెలరోజులుగా మూడు ఫార్మాట్లలో బీభత్సమైన ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో సంచలనం. ఫార్మాట్ ఏదైనా గిల్ బాదుడు మాములుగా లేదు. శ్రీలంకతో పాటు న్యూజిలాండ్ తో సిరీస్ లో కూడా గిల్ రెచ్చిపోయి రికార్డుల దుమ్ము దులిపాడు. టీ20లకు పనికిరాడు అనుకున్నవారికి.. ‘ఇదుగో ఇది చూసి మాట్లాడండి’అని అహ్మదాబాద్ ఇన్నింగ్స్ ను అంకితమిచ్చాడు. అయితే అహ్మదాబాద్ లో గిల్ కు ఓ అమ్మాయి వినూత్న రీతిలో ప్రపోజ్ చేసింది.
మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అమ్మాయి.. ‘టిండర్.. శుభ్‌మన్ తో మ్యాచ్ కలుపు..’అని బ్యానర్ పట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు ఇదే ఫోటోను స్ఫూర్తిగా తీసుకున్న టిండర్.. నాగ్‌పూర్ లో రచ్చ రచ్చ చేస్తున్నది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే తొలి టెస్టుకు నాగ్‌పూర్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. ఈనెల 9 నుంచి ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ టెస్టుకు గిల్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యాడు. తుది జట్టులో గిల్ ఉంటాడా..? లేడా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కానీ నాగ్‌పూర్ కు వచ్చిన గిల్ కు టిండర్.. వినూత్న రీతిలో స్వాగతం పలికింది.
అహ్మదాబాద్ లో బ్యానర్ పట్టుకుని వైరల్ అయిన అమ్మాయి ఫోటోను పెట్టి.. ‘శుభ్‌మన్ ఇటు కొంచెం చూడు బాబు..’ అని భారీ హోర్డింగుల మీద రాసుకొచ్చింది. వీటిని టీమిండియా వెటరన్ పేసర్, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు భారత జట్టుకు ఎంపికైన ఉమేశ్ యాదవ్ తన ట్విటర్ లో షేర్ చేశాడు. ‘మొత్తం నాగ్‌పూర్ నీ వెనకాలే పడుతోంది. గిల్ కొంచెం ఇటు చూడవయ్యా..’ అని ఉమేశ్ రాసుకొచ్చాడు. ఉమేశ్ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.