పోష్ స్ట్రూమ్: అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియా సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాను భారత పేసర్ కార్తిక్ త్యాగి చావు దెబ్బ తీశాడు. దాంతో ఆస్ట్రేలియా 74 పరుగుల తేడాతో ఇండియాపై పరాజయం పాలై తోక ముడిచింది. 

మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో గత ప్రపంచ కప్ రన్నరప్ ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే చిత్తయింది. 2008 తర్వాత ఆస్ట్రేలియా జట్టు సెమీ ఫైనల్ కు చేరకపోవడం ఇదే తొలిసారి. 

తొలుత బ్యాటింగ్ లో ఇండియా తడబడింది. అయితే యశస్వి జైశ్వాల్ (82 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 62 పరుగులు), అధర్వ అంకోలేకర్ 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 55 పరుగులు) జట్టును అదుకున్నారు. 

టాప్ ఆర్డర్ లో ఓపెనర్ దివ్యాన్ష్ (14), తెలుగు యువకుడు ఠాకూర్ తిలక్ వర్మ (2), కెప్టెన్ ప్రియమ్ గార్డ్ (15) విఫలమయ్యారు. ఆ స్థితిలో లోయర్ ఆర్డర్ లో అధర్వ, సిద్దేశ్ వీర్, రవి బిష్ణోయ్ కలిసి స్కోరును పెంచారు.

234 పరగుుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను భారత పేసర్లు కార్తిక్ త్యాగి, ఆకాశ్ సింగ్ చావు దెబ్బ తీశారు. కార్తిక్ త్యాగి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఆకాశ్ సింగ్ 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 

కార్తిక్ త్యాగి బౌలింగ్ తో ఆస్ట్రేలియా 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సామ్ ఫానింగ్ (75 పరుగులు), స్కాట్ 35) పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. కార్తిక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు. ఈ విజయంతో అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా పది విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్ ఘనత సాధించింది.

అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించే జట్టుతో సెమీ ఫైనల్లో భారత్ తలపడుతుంది.