మొన్న జింబాబ్వే, నిన్న నెదర్లాండ్స్‌తో, నేడు స్కాట్లాండ్‌తో కూడా మ్యాచులు ఓడిన వెస్టిండీస్... టూ టైం ఛాంపియన్ విండీస్ లేకుండానే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ...
రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్ క్రికెట్ టీమ్, పరువు పోగొట్టుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన విండీస్, వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో అసోసియేట్ దేశాల చేతుల్లోనూ చిత్తుగా ఓడింది..
గ్రూప్ స్టేజీలో జింబాబ్వే చేతుల్లో 35 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్, ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పరాజయం పాలైంది. తాజాగా సూపర్ 6 రౌండ్‌లో స్కాట్లాండ్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓడిన వెస్టిండీస్, వరల్డ్ కప్ క్వాలిఫైయర్ రేసు నుంచి తప్పుకుంది.. స్కాట్లాండ్‌కి ఇది విండీస్‌పై మొదటి వన్డే విజయం..
స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, 43.5 ఓవర్లలో 181 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బ్రెండన్ కింగ్ 22, కెప్టెన్ షై హోప్ 13, నికోలస్ పూరన్ 21, జాసన్ హోల్డర్ 45, రొమారియో షెఫర్డ్ 36 పరుగులు చేయగా కెవిన్ సిన్‌క్లెయిర్ 10 పరుగులు చేశాడు..
చార్లెస్, షామర్ బ్రూక్స్ డకౌట్ కాగా కైల్ మేయర్స్ 5, అల్జెరీ జోసఫ్ 6, అకీల్ హుస్సేన్ 6 పరుగులు చేశారు. 182 పరుగుల లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది స్కాట్లాండ్. ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్‌బ్రైడ్‌ని ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ చేశాడు జాసన్ హోల్డర్.
అయితే ఆ తర్వాత బ్రెండన్ మెక్‌ముల్లెన్, మాథ్యూ క్రాస్ కలిసి రెండో వికెట్‌కి 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి విండీస్‌ని చావుదెబ్బ తీశారు. 69 పరుగులు చేసిన బ్రెండన్ మెక్‌ముల్లెన్‌ని రొమారియో షిఫర్డ్ అవుట్ చేయగా జార్జ్ మున్సీ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మాథ్యూ క్రాస్ 74 పరుగులు చేయగా కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ 13 పరుగులతో నిలిచి స్కాట్లాండ్‌కి విజయాన్ని అందించారు..
1975, 1979 వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచి, క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్, వన్డే వరల్డ్ కప్‌కి అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. క్వాలిఫైయర్స్‌లో భాగంగా వెస్టిండీస్, జూలై 5న ఓమన్‌తో, జూలై 7న శ్రీలంకతో మ్యాచులు ఆడనుంది..
వెస్టిండీస్ పరాజయాలపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ‘సిగ్గు చేటు. వరల్డ్ కప్‌కి వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు, సరైన ఫోకస్, మంచి మేనేజ్‌మెంట్ కూడా ఉండాలనేదానికి ఇదే ఉదాహరణం. రాజకీయాలకు అతీతంగా క్రికెట్‌ని నడిపిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ విండీస్‌కి దక్కిన ఒకే ఒక్క ఊరట ఏంటంటే ఇంత కంటే పతనం కావడానికి ఇంకేమీ మిగల్లేదు. మీరు పూర్తిగా దిగజారారు...’ అంటూ ట్వీట్ చేశాడు సెహ్వాగ్..
