KTR Praises Umran Malik: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్న అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్, కశ్మీరి కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ సంచలనాలు క్రికెట్ ప్రేమికులనే కాదు రాజకీయ నాయకులను కూడా మెప్పిస్తున్నాయి. గత సీజన్ నుంచి నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్న ఈ యువ సంచలనంపై పలువురు రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్.. ఉమ్రాన్ మాలిక్ ను ఆకాశానికెత్తారు. భీకరమైన పేస్ తో నమ్మశక్యం కాని స్పెల్స్ విసరుతున్నాడని, అతడిని త్వరలోనే భారత జట్టులో చూడాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.
పంజాబ్ కింగ్స్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్.. నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘నమ్మశక్యం కాని స్పెల్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్. టేక్ ఎ బౌ యంగ్ మ్యాన్..’ అని ఉమ్రాన్ పై ప్రశంసలు కురిపించాడు.
ఇక పంజాబ్ ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ వేసిన ఉమ్రాన్.. ఆ ఓవర్లో పరుగులేమీ ఇవ్వకుండా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా జత చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ వేసిన ఉమ్రాన్.. తొల బంతికి పరుగు ఇవ్వలేదు. రెండో బంతికి ఒడియన్ స్మిత్ ఔట్ అయ్యాడు. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. తర్వాత రెండు బంతుల్లో వరుసగా రాహుల్ చాహర్, వైభవ్ అరోరా లు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఆఖరు బంతికి అర్షదీప్ సింగ్ రనౌట్ గా వెనుదిరిగాడు. ఓవర్ మెయిడిన్ కావడంతో పాటు నాలుగు వికెట్లు కూడా పడ్డాయి. దీంతో ఐపీఎల్ లో 20వ ఓవర్ మెయిడిన్ చేసిన ఇర్ఫాన్ పఠాన్, లసిత్ మలింగ, జయదేవ్ ఉనద్కత్ ల సరసన ఉమ్రాన్ కూడా చేరాడు.
ఇదిలాఉండగా ఉమ్రాన్ సూపర్ స్పెల్ పై శశి థరూర్ స్పందిస్తూ... ‘అతడి (ఉమ్రాన్) ని మేము భారత జట్టులో చూడాలనుకుంటున్నాం. అత్యద్భుతమైన టాలెంట్ అతడిలో దాగుంది. అతడిని వెంటనే ఇంగ్లాండ్ కు తీసుకెళ్లి అక్కడి పచ్చిక పిచ్ ల మీద టెస్టులు ఆడించండి. అతడు, బుమ్రా కలిసి ఇంగ్లీష్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడతారు..’ అని రాసుకొచ్చాడు.
ఈ కశ్మీరి కుర్రాడి ప్రదర్శన ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ ను కూడా ఆకట్టుకుంది. అతడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఉమ్రాన్ త్వరలోనే భారత జట్టులో ఆడతాడు. ఒకవేళ నేనే బీసీసీఐలో గనక ఉండి ఉంటే అతడిని ఇంగ్లాండ్ కు పంపించి కౌంటీ లు ఆడించి ఉండేవాడిని. అవి అతడి బౌలింగ్ మెరుగుపడటానికి ఎంతో సాయం చేస్తాయి..’ అని పేర్కొన్నాడు.
