Asianet News TeluguAsianet News Telugu

Ashes: ఉత్కంఠభరిత పోరాటంతో యాషెస్ లో వైట్ వాష్ తప్పించుకున్న ఇంగ్లాండ్.. ఆఖరి బంతి దాకా టెన్షన్

Australia VS England: యాషెస్ లో వరుస ఓటముల పాలవుతూ పరువు పోగొట్టుకుంటున్న ఇంగ్లాండ్ కు కాస్త ఊరట. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీవీల ముందు చూస్తున్న యాషెస్ క్రికెట్ అభిమానులకు సిడ్నీ టెస్టు అసలైన  టెస్టు క్రికెట్ మజాను పంచింది.

The Ashes: James Anderson And Stuart Broad  Saves England In Sydney Test, Match Drawn
Author
Hyderabad, First Published Jan 9, 2022, 2:13 PM IST

ఏకపక్ష విజయాలతో ఆస్ట్రేలియా వరుసగా మూడు మ్యాచులలో గెలవడంతో పాటు  మునుపెన్నడూ లేనంతగా అసలు పోరాటం అంటేనే మరిచిపోయినట్టు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడటంతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ చూసేవాళ్లకు కూడా ఎక్కడో చిన్న నిరాశ. ఈ సీరిస్ కు ఉన్న ప్రత్యేకత ఎక్కడో మిస్ అవుతుందని పెదవి విరిచిన వాళ్లు లేకపోలేదు. తొలి మూడు టెస్టులలో ఇంగ్లాండ్.. ఆసీస్ కు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. దీంతో మిగిలిన రెండు టెస్టులు నామమాత్రమైపోతాయని  అందరూ అనుకున్నారు. కానీ సిడ్నీ టెస్టు మాత్రం రెండు  దేశాల క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ కు అసలైన టెస్టు క్రికెట్ మజాను పంచింది. 

సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టును ఇంగ్లాండ్ అతికష్టం మీద డ్రా చేసుకుంది. ఆఖరి బంతి వరకు  అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచులో  ఆస్ట్రేలియాకు తీవ్ర నిరాశ ఎదురైంది. తొమ్మిది వికెట్లను పడగొట్టిన ఆ జట్టు.. చివరి వికెట్ ను మాత్రం తీయలేకపోయారు. ఇంగ్లాండ్  లోయరార్డర్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. ముఖ్యంగా ఆ జట్టు  బౌలింగ్  ద్వయం స్టువర్ట్ బ్రాడ్ (35 బంతుల్లో 8 నాటౌట్) , జేమ్స్ అండర్సన్ (6 బంతుల్లో 0 నాటౌట్) లు నిలబడకపోయి ఉంటే ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ కు నాలుగో పరాభావం తప్పకపోయేది. 

 

 
ఇంగ్లాండ్ బ్యాటర్లు.. మళ్లీ ప్చ్...

 

358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  ఇంగ్లాండ్ ఇన్నింగ్స్  పడుతూ లేస్తూ సాగింది. ఆట చివరి రోజైన ఆదివారం  ఇంగ్లాండ్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. ఓపెనర్ హసీబ్ హమీద్ (9) మరోసారి విఫలమవగా.. డేవిడ్ మలన్ (4), జో రూట్ (24) కూడా త్వరగానే నిష్క్రమించారు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (123 బంతుల్లో 60),  బెయిర్ స్టో (105 బంతుల్లో  41)  లు ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. 

మూడో సెషన్ దాకా కాస్తో కూస్తో ఆడిన మిడిలార్డర్ కూడా చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ ను గట్టెక్కించాల్సిన బాధ్యత లోయరార్డర్ మీద పడింది.  ఆ జట్టు తరఫున తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన జానీ బెయిర్ స్టో.. జాక్ లీచ్ (34 బంతుల్లో 26) తో కలిసి పోరాడాడు. కానీ ఆసీస్ బౌలర్లు ఈ ఇద్దరినీ పెవిలియన్ కు పంపారు. స్కోరు 237 పరుగుల వద్ద ఉండగా (మరో 11 ఓవర్ల ఆట మిగిలుండగా.. ) బెయిర్  స్టో ను బొలాండ్ ఔట్ చేశాడు. 

అప్పుడు మొదలైంది టెన్షన్.. 

ఇక ఆట మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా ఇంగ్లాండ్ 8వ వికెట్ కోల్పోయింది. 270 పరుగుల వద్ద కుదురుకున్నట్టు కనిపించిన లీచ్ ను ఆసీస్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పెవిలియన్ కు పంపాడు. ఇక అప్పట్నుంచి అసలు డ్రామా స్టార్టయ్యింది.  ఉన్నది ఒక్క ఓవర్. ఆసీస్ కు ఒక వికెట్ కావాలి.  మ్యాచును కాపాడుకోవాలంటే ఇంగ్లాండ్ కు ఉన్న ఆప్షన్ ఆరు బంతులు ఆడటం.. ఆ టైమ్ లో స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ లు తమ అనుభవన్నంతా రంగరించి ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. స్మిత్ వేసిన ఆఖరు ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్ కు వికెట్ దక్కనివ్వలేదు.   

 

ఆసీస్ సారథి పాట్ కమిన్స్.. ఫీల్డర్లందరినీ అండర్సన్ పక్కనే మొహరించినా  ఒత్తిడికి లోనుకాకుండా అతడు అద్భుతమైన పోరాటం చేశాడు. ఫలితంగా నాలుగో టెస్టు గెలవాలన్న ఆసీస్ ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పటికే కంగారూలు యాషెస్ ను 3-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక సిడ్నీ టెస్టులో వరుస ఇన్నింగ్సులలో రెండు సెంచరీలు చేసిన  ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

సంక్షిప్త స్కోర్లు : 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 416-8 డిక్లేర్డ్ 
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 294 ఆలౌట్ 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 265-6  డిక్లేర్డ్ 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 270-9
 

Follow Us:
Download App:
  • android
  • ios