లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్‌పై తిరుగులేని ఆధిక్యంలో ఆస్ట్రేలియా... ఆఖరి రోజు రసవత్తరంగా సాగనున్న రెండో టెస్టు... విజయానికి 257 పరుగుల దూరంలో ఇంగ్లాండ్, 6 వికెట్ల దూరంలో ఆస్ట్రేలియా..
యాషెస్ సిరీస్‌లో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లాండ్‌కి ఆస్ట్రేలియా ఇంకో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 31 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.. ఆఖరి రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 257 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా విజయానికి మరో 6 వికెట్లు తీస్తే చాలు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకి ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 325 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఉస్మాన్ ఖవాజా 77 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 25, మార్నస్ లబుషేన్ 30, స్టీవ్ స్మిత్ 34 పరుగులు చేశారు..
ట్రావిస్ హెడ్ 7 పరుగులకే అవుట్ కాగా కామెరూన్ గ్రీన్ 18, అలెక్స్ క్యారీ 21, ప్యాట్ కమ్మిన్స్ 11 పరుగులు, జోష్ హజల్‌వుడ్ 1 పరుగు చేశారు. మిచెల్ స్టార్క్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలవగా గాయంతో నడవడానికి కూడా ఇబ్బందిపడిన నాథన్ లియాన్, బ్యాటింగ్‌కి రావడమే కాకుండా 13 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్ బాది ఆఖరి వికెట్‌గా అవుట్ అయ్యాడు..
ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్‌కి 4 వికెట్లు దక్కగా జోష్ టంగ్, ఓల్లీ రాబిన్‌సన్ రెండేసి వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్‌లకు చెరో వికెట్ దక్కింది. 371 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది.
జాక్ క్రావ్లే 3, ఓల్లీ పోప్ 3 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. 18 పరుగులు చేసిన జో రూట్ కూడా ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ కాగా భారీ అంచనాలు పెట్టుకున్న హారీ బ్రూక్ 4 పరుగులకే కమ్మిన్స్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
దీంతో 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లాండ్. ఈ దశలో బెన్ స్టోక్స్, బెన్ డక్లెట్ కలిసి మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 69 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
బెన్ డక్లెట్ 67 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేయగా బెన్ స్టోక్స్ 66 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరూ ఐదో రోజు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనేదానిపైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్న బెన్ డక్లెట్, రెండో ఇన్నింగ్స్‌లోనూ బాగా ఆడుతున్నాడు.
వీరితో పాటు తర్వాత బ్యాటింగ్‌కి వచ్చే జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, ఓల్లీ రాబిన్‌సన్ వరకూ దూకుడుగా అంతో కొంతో పరుగులు చేయగలరు. అయితే ఐదో రోజు 257 పరుగుల టార్గెట్‌ని కొట్టడం అనేది టాపార్డర్‌ని కోల్పోయిన ఇంగ్లాండ్‌కి చాలా పెద్ద టాస్కే..
