సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన తెంబ భవుమా... సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం..
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న ఆస్ట్రేలియా... తెంబ భవునా వీరోచిత సెంచరీ పోరాటం వృథా...
వన్డే వరల్డ్ కప్ వచ్చిందంటే వీర లెవెల్లో పర్ఫామెన్స్ ఇవ్వడం ఆస్ట్రేలియాకి బాగా అలవాటు. అప్పటిదాకా పనికి రాని ద్వైపాక్షిక సిరీసుల్లో ఎలా ఆడినా, వన్డే వరల్డ్ కప్ టోర్నీ గెలవడానికి ఎలా ఆడాలో, ఎలా నెగ్గాలో ఆస్ట్రేలియాకి తెలిసినట్టు మరే జట్టుకి తెలీదు. ఇప్పటికే నాలుగు వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన ఆస్ట్రేలియా, 2023 వన్డే వరల్డ్ కప్‌లోనే వన్ ఆఫ్ ది టైటిల్ ఫెవరెట్ టీమ్..
వన్డే వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతున్న ఆసీస్, తొలి వన్డేలో ఘన విజయం అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 49 ఓవర్లలో 222 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
క్వింటన్ డి కాక్ 11, వాన్ దేర్ దుస్సేన్ 8, అయిడిన్ మార్క్‌రమ్ 19, హెన్రీచ్ క్లాస్ 14 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ డకౌట్ అయ్యాడు. 100 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరింది.
మార్కో జాన్సెన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేయగా గెరాల్డ్ కోట్జీ 2, కేశవ్ మహరాజ్ 2, కగిసో రబాడా 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. లుంగి ఎంగిడి డకౌట్ అయ్యాడు. ఓ వైప్ వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన కెప్టెన్ తెంబ భవుమా 142 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 114 పరుగులు చేసి అజేయ సెంచరీతో టీమ్‌ని ఆదుకున్నాడు..
సౌతాఫ్రికా 222 పరుగులు చేస్తే అందులో ఎక్స్‌ట్రాలు 19. ఎక్స్‌ట్రాలు తీసేస్తే మిగిలిన స్కోరులో కెప్టెన్ తెంబ భువుమా ఒక్కడే 60 శాతానికి పైగా స్కోరు చేశాడు. అయితే ఈ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకి ఆశించిన ఆరంభం దక్కలేదు.
డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా ట్రావిస్ హెడ్ 33, మిచెల్ మార్ష్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కామెరూన్ గ్రీన్ పరుగులేమీ చేయకుండానే 2 బంతులు ఎదుర్కొని, గాయంతో రిటైర్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లీష్ 1, అలెక్స్ క్యారీ 3, మార్కస్ స్టోయినిస్ 17 పరుగులు చేయగా సీన్ అబ్బాట్ 9 పరుగులు చేశాడు. 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా..
ఏడో వికెట్ పడే సమయానికి ఆస్ట్రేలియా విజయానికి 110 పరుగులు కావాలి. అయితే 8వ స్థానంలో వచ్చిన మార్నస్ లబుషేన్, 10వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అస్టన్ అగర్ కలిసి ఆస్ట్రేలియాకి విజయం అందించారు. ఈ ఇద్దరూ 8వ వికెట్‌కి అజేయంగా 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
మార్నస్ లబుషేన్ 93 బంతుల్లో 8 ఫోర్లతో 80 పరుగులు చేయగా అస్టన్ అగర్ 69 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేశాడు. అస్టన్ అగర్‌కి వన్డేల్లో ఇదే అత్యుత్తమ స్కోరు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ ఐదు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 17న ముగియనుంది.