Asianet News TeluguAsianet News Telugu

125 బంతుల్లో త్రిబుల్ సెంచరీ, 30 సిక్సర్లతో నాటు కొట్టుడు... ఢిల్లీ బుడ్డోడు బ్యాటింగ్‌కి...

అండర్‌-13 డ్రీమ్ ఛేజర్స్ కప్ టోర్నీలో 125 బంతుల్లో 30 సిక్సర్లు, 28 ఫోర్లతో త్రిబుల్ సెంచరీ చేసిన మోహక్ కుమార్... 

teenager hits triple century with 30 sixers, IPL Team Delhi Capitals share video
Author
India, First Published Nov 27, 2021, 10:33 AM IST

ఊరకొట్టుడు, చితక్కొట్టుడు, నాటు కొట్టుడు... అనే పదాలకు పర్ఫెక్ట్ ఉదాహరణ ఇదేనేమో. 125 బంతుల్లో త్రిబుల్ సెంచరీ... కాదు, కాదు... అంతకుమించి బాదేశాడు ఓ బుడతడు. 30 సిక్సర్లు, 28 ఫోర్లు బాది కేవలం బౌండరీలతోనే 292 పరుగులు సాధించాడు. అదీ కేవలం 58 బంతుల్లోనే... తన పేరు మోహక్ కుమార్. ఓవరాల్‌గా 125 బంతుల్లో 30 ఫోర్లు, 28 సిక్సర్లతో 331 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

అండర్‌-13 డ్రీమ్ ఛేజర్స్ కప్ టోర్నీలో జరిగిన ఈ విధ్వంకర ఇన్నింగ్స్‌ను ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కి బాల్ భవన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 13 ఏళ్ల మోహక్ కుమార్ సృష్టించిన సునామీ ఇది.

ఢిల్లీలోని శిక్షా భారతి పబ్లిక్ స్కూల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బాల్ భవన్ క్రికెట్ అకాడమీ జట్టు తరుపున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మోహన్ కుమార్... బౌలర్లకు చుక్కలు చూపించాడు...

ఓపెనర్లు 5 పరుగులకే పెవిలియన్ చేరడంతో త్వరగా క్రీజులోకి వచ్చిన మోహక్ కుమార్, 137 నిమిషాల పాటు క్రీజులో కుదురుకుపోయి 264.80 స్ట్రైయిక్ రేటుతో చెలరేగిపోయాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అయిన మోహక్ కుమార్‌కి వికెట్ కీపర్ శివాయ్ మాలిక్ 67 పరుగులు, ఆర్యన్ భరద్వాజ్ 40 పరుగులు చేసి మంచి సహకారం అందించారు. 

మోహక్ మ్యాజికల్ ఇన్నింగ్స్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ బాల్ భవన్ క్రికెట్ అకాడమీ 40 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 576 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యంతో బరిలో దిగిన ఎడూరెన్స్ క్రికెట్ అకాడమీ జట్టు 17.1 ఓవర్లలో 153 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

ఎడ్యూరెన్స్ క్రికెట్ అకాడమీ తరుపున ఆడిన మేధాన్స్, 53 బంతుల్లో 126 పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ రాణించలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బాల్ భవన్ అకాడమీ బౌలర్లు వామన్ 29 పరుగులకే 5 వికెట్లు తీయగా, యతిన్ 45 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బాల్ భవన్ క్రికెట్ అకాడమీకి భారీ విజయం దక్కింది...

ఇంతకుముందు 2016లో స్కూల్ క్రికెట్‌లో ముంబై క్రికెటర్ ప్రణవ్ ధనవాడే వెయ్యి పరుగులు చేసి చరిత్ర క్రియేట్ చేశాడు. 6 గంటల 36 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 327 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 308.56 స్ట్రైయిక్ రేటుతో 1009 పరుగులు చేశాడు ప్రణవ్ ధన‌వాడే. 116 ఏళ్లకి ముందు ఏ.ఈ.జె. కొల్లిన్స్ 628 పరుగులు చేయడమే అంతకుముందు దాకా అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. 

Follow Us:
Download App:
  • android
  • ios