Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా చీఫ్ కోచ్ రేసులో జింబాబ్వే కోచ్...

టీమిండియా హెడ్ కోచ్ రేసులో మరో భారతీయ మాజీ క్రికెటర్ చేరాడు. ప్రస్తుతం జింబాబ్వే టీం చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్న లాల్ చంద్ రాజ్‌పుత్ టీమిండియా కోచ్ పదవికోసం దరఖాస్తు చేసుకున్నారు.  

team india veteran player lalchand rajput joins race for India's head coach position
Author
Mumbai, First Published Jul 31, 2019, 7:38 PM IST

టీమిండియా కోచింగ్ సిబ్బంది ఎంపిక కోసం బిసిసిఐ నెల రోజుల క్రితమే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది దేశ, విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు చీఫ్ కోచ్ పదవిపై ఆసక్తితో దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో మరో టీమిండియా మాజీ క్రికెటర్ లాల్ చంద్ రాజ్‌పుత్ కూడా ఈ రేసులో నిలిచాడు. దీంతో టీమిండియా చీఫ్ కోచ్ నియామక ప్రక్రియ చేపడుతున్న సిఏసికి ఎంపిక మరింత క్లిష్టంగా మారనుంది. 

మాజీ క్రికెటర్ అయిన రాజ్‌పుత్ ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ టీం కోచ్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఐసిసి జింబాబ్వే జట్టుపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఆటగాళ్ళ పరిస్థితే కాదు అతడి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇదే సమయంలో టీమిండియా నూతన కోచ్ వేటలో వున్నట్లు తెలుసుకున్న రాజ్ పుత్ చివరి రోజు దరఖాస్తు చేసుకున్నాడు. అతడు దుబాయ్ నుండి తన దరఖాస్తుకు సంబంధించిన పత్రాలను బిసిసిఐకి పంపించాడు. 

నిన్న మంగళవారమే (జూలై 30) ఈ పదవులకు దరఖాస్తు చేసుకోడానికి విధించిన గడువు ముగిసింది. అలా చివరిరోజు హటాత్తుగా రాజ్ పుత్ టీమిండియా చీఫ్ కోచ్ పదవి రేసులోకి వచ్చాడు. చీఫ్ కోచ్ పదవి కాకుంటే బ్యాటింగ్ కోచ్ పదవి కోసమైనా తన పేరును పరిశీలించాలని అతడు కోరినట్లు సమాచారం. 

రాజ్‌పుత్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన  తర్వాత వివిధ స్థాయిలో పనిచేశాడు. 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచ కప్ లో  టీమిండియా మేనేజర్ గా వ్యవహరించాడు. అప్పుడే భారత్ మొదటి టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత అతడు అప్ఘానిస్తాన్, ప్రస్తుతం జింబాబ్వే కోచ్ గా పనిచేశాడు. ఇప్పుడు మళ్లీ టీమిండియాతో కలిసి పనిచేసేందుకు లాల్ చంద్ ఉవ్విళ్లూరుతున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios