ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అయితే అత్యుత్తమ ఆటతీరుతో వరుస విజయాలను అందుకున్నప్పటికి సెమీస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ టోర్నీలో భారత జట్టు ప్రదర్శన అంత చెత్తగా లేకున్న ట్రోఫీని సాధించలేకపోవడాన్ని  వైఫల్యం కిందే లెక్క. కాబట్టి భారత జట్టులో కొన్ని మార్పులు చేపట్టేందుకు బిసిసిఐ సిద్దమైంది. ఆ పని చీఫ్ కోచ్ ఎంపికతోనే ప్రారంభించింది. 

రవిశాస్త్రిపై వేటు తప్పదా? 

ప్రస్తుతం భారత జట్టు చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి పనిచేస్తున్నారు. అయితే అతడి కాంట్రాక్ట్ కాలం ముగియడంతో బిసిసిఐ కొత్త కోచ్ ఎంపికను మొదలుపెట్టింది. టీమిండియా ఆటగాళ్ళను మరింత సానబెట్టే కోచ్ పదవిపై ఆసక్తి, అర్హత వున్న వారినుండి  బిసిసిఐ ఇప్పటికే దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది.  అయితే ఈ దరఖాస్తులను పరిశీలించి, నూతన కోచ్ నియామకాన్ని చేపట్టే బాధ్యతను మాత్రం బిసిసిఐ కపిల్ దేవ్ కు అప్పగించింది. 

కపిల్ దేవ్ నేతృత్వంలో కమిటీ:

టీమిండియా కోచింగ్ సిబ్బంది ఎంపిక బాధ్యతను టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు అప్పగించడం వెనుక పెద్ద కారణమే వుందంటూ ఓ బిసిసిఐ అధికారి తెలిపారు. గతంలో అనిల్ కుంబ్లే కోచ్ గా పనిచేసిన సమయంలో విరాట్ కోహ్లీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. కేవలం కోహ్లీ ఒత్తిడి కారణంగానే కుంబ్లేను చీఫ్ కోచ్ పదవి నుండి తప్పించినట్లు ఆ సమయంలో బాగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడలా జరగదని బిసిసిఐ అధికారి పేర్కొన్నాడు. 

అయితే రవిశాస్త్రిని టీమిండియా కోచ్ గా ఎంపికవడంలో కోహ్లీ పాత్ర కూడా ప్రధానమైనది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాన కోచ్ వ్యవహారంలో కోహ్లీ ప్రమేయం అంతగా వుండకపోవచ్చని తెలుస్తోంది. అతడికి చెక్ పెట్టేందుకు నూతన కోచ్ ఎంపిక  బాధ్యతను కపిల్ దేవ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన అయితేనే స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోగలడని....కెప్టెన్ కోహ్లీ మాటలను పరిగణలోకి తీసుకోడని భావించే బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

గతంలో మాదిరిగా కాకుండా టీమిండియా సహాయక బృందాన్ని కూడా కపిల్ దేవ్ సారథ్యంలోని కమీటీయే నియమిస్తుంది. అయితే ఈ విషయంలో మాత్రం నూతనంగా ఎంపికయ్యే ప్రధాన కోచ్ అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఈ చీఫ్ కోచ్, సహాయక సిబ్బందిని కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో ఏర్పాటు చేసిన కమిటీ నియమించినా చివరకు బిసిసిఐ పరిపాలక మండలి ఆమోదం తర్వాతే వారు అధికారిక ఎంపిక పూర్తవుతుంది.