ముంబై: ఐపిఎల్ 2020 ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ చేపట్టనున్న విషయం తెలిసిందే. నాలుగు టెస్టులతో పాటు మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు జరిగే ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇలా ఆసిస్ టూర్ కు సర్వం సిద్దమైన సమయంలో కరోనా మహమ్మారి జట్టులో అలజడి సృష్టిస్తోంది. 

భారత జట్టు సహాయక సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపిఎల్ ఆడుతున్న ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికయిన మిగతా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా టైస్టులు నిర్వహించారు. ఇందులోనే టీమిండియా సహాయక సిబ్బంది ఒకరికి కరోనా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు దూరం పెట్టింది బిసిసిఐ. 

ఇకపోతే ఐపిఎల్ ముగిసిన వెంటనే దుబాయ్ నుండే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు పయనమవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కోచ్ రవిశాస్త్రితో పాటు మిగతా సహాయక సిబ్బంది కూడా దుబాయ్ కి చేరుకున్నారు. అలాగే ఐపిఎల్ ఆడకుండా భారత్ లోనే వున్నా టెస్ట్ స్పెషలిస్ట్ లు చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలు కూడా ఆదివారమే దుబాయ్ కి చేరుకున్నారు. వీరితో పాటే దుబాయ్ కి వెళ్లాల్సిన సదరు సహాయక సిబ్బంది కరోనా సోకడంతో వెళ్లలేకపోయాడు.