స్నేహితుల దినోత్సవం, స్నేహం గొప్పతనంపై టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనదైన శైలీలో స్పందించారు. ప్రపంచంలో అమ్మ ప్రేమ తర్వాత అంత గొప్ప ప్రేమ కేవలం స్నేహితుల్లోనే ఉంటుందని అన్నారు.

కుటుంబ సభ్యుల తర్వాత మన శ్రేయస్సు కోరేవారే నిజమైన స్నేహితులని.. కష్టాలొస్తే కలిసి పంచుకోవడం, సంతోషం వేస్తే సరదాగా నవ్వుకోవడం స్నేహితులకే చెల్లిందన్నారు. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నా పెద్దయ్యాక విడిపోయినా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని సచిన్ వ్యాఖ్యానించారు.

అలాంటి స్నేహితులకు ఆయన ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్విట్టర్‌లో తన చిన్న నాటి స్నేహితులతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. స్నేహబంధాలు అనేవి ఫ్లడ్‌లైట్ల లాంటివని.. మన విజయాల్ని ఓ మూల నుంచే ఆస్వాదిస్తాయన్నారు.

అలాగే, మనమీద నుంచి సూర్యుడు పోతున్నాడని తెలిస్తే వాటంతట అవే వెలిగిపోతాయని టెండూల్కర్ వెల్లడించారు. మన చుట్టూ వెలుగునిస్తూ ఉపయోగంగా ఉంటాయని... నాకైతే ప్రతీరోజు స్నేహితుల దినోత్సవమేనని సచిన్ చెప్పారు.

ఐపీఎల్‌ టాప్ ఫ్రాంఛైజీలు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశాయి. ముంబై తమ ఆటగాళ్ల ఫోటోలు పంచుకొని ఒక కుటుంబంగా మారిన మిత్రులకు ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలని పేర్కొంది. అలాగే సీఎస్‌కే కూడా ధోనీ, రైనాల వీడియో పంచుకొని వాళ్లిద్దరూ మంచి స్నేహితులని, జట్టును తిరుగులేని స్థితిలో నడిపిస్తున్నారని మెచ్చుకొంది.