Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ: రేపటి నుంచే టీమిండియా ‘మిషన్ 2023’.. ఇకనైనా వాళ్లకు ఛాన్స్ ఇస్తారా..?

INDvsNZ ODI: టీ20 ప్రపంచకప్ ను దక్కించుకోవాలన్న భారత ఆశలు సెమీఫైనల్లోనే  అడియాసలయ్యాయి. మరో టీ20 సమరానికి రెండేండ్లు టైమ్ ఉంది. కానీ ఆలోపే భారత జట్టు మరో ఐసీసీ టోర్నీ ఆడనుంది.

Team India's Mission 2023  Begins From New Zealand Series, ODI Series will Kick Off on Friday
Author
First Published Nov 24, 2022, 6:50 PM IST

2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ కోసం భారత జట్టు  ఎదురుచూపులు తప్పడం లేదు. కొత్త కెప్టెన్, హెడ్ కోచ్ ల కలయికలో ఐసీసీ ట్రోఫీ ఖాయమనుకున్న భారత జట్టుకు ఆస్ట్రేలియాలో తీవ్ర నిరాశే మిగిలింది. కోహ్లీ - రవిశాస్త్రిలు సాధించలేని ఆ ట్రోఫీని రోహిత్ శర్మ - రాహుల్ ద్రావిడ్ ల జంట అయినా సాధిస్తుందని అంతా ఆశించారు.  కానీ  ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీస్ లోనే నిష్క్రమించింది. ఇక  ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా ఆశలన్నీ వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మీదే ఉన్నాయి.  ఈ మేరకు శుక్రవారం నుంచే భారత్ ‘మిషన్ 2023’ ప్రారంభించబోతున్నది. 

భారత రెగ్యులర్ సారథి  రోహిత్ శర్మ గైర్హాజరీలో  టీమిండియాను  శిఖర్ ధావన్ నడిపించనున్నాడు.  2023 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకునే జట్టు కూర్పు,  ఆటగాళ్ల ప్రదర్శన మీద టీమ్ మేనేజ్మెంట్ నిఘా  పెట్టనుంది.  రోహిత్, కోహ్లీ,  రాహుల్,  అశ్విన్, జడేజా, బుమ్రా వంటి సీనియర్లు లేని ఈ జట్టులో  యువ ఆటగాళ్లకు పరీక్షించడానికి కూడా ఈ సిరీస్ బాగా ఉపయోగపడనుంది. 

సీనియర్లు లేకపోవడంతో ఓపెనర్ గా శుభమన్ గిల్ కు ఇది మంచి అవకాశం.  ఈ టోర్నీలో గనక రాణిస్తే అతడు  వన్డే ప్రపంచకప్ కు   ప్లేస్ ఖాయం చేసుకున్నట్టే అని స్వయంగా  సునీల్ గవాస్కర్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.  గిల్ తో పాటు యువ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్, పేసర్ ఉమ్రాన్ మాలిక్ లకూ ఇది కీలక సిరీస్.  ఈ ఇద్దరికీ అవకాశాలు దక్కితే  వాళ్లు ఎలా వినియోగించుకుంటారన్నది ఆసక్తికరం.. 

సంజూకు ఇప్పుడైనా.. 

ఇక గత కొంతకాలంగా భారత క్రికెట్ లో   సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ ఇగ్నోర్ చేస్తున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా..? అంటే టక్కున వినిపించే సమాధానం   సంజూ శాంసన్. నిన్నా మొన్నటివరకు అతడికి జట్టులోకి ఎంపిక చేయక.. ఎంపిక చేసినాక అవకాశాలివ్వక  శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్ తో సిరీస్ లో కూడా  అతడిని అవకాశం రాలేదు. పంత్ పదే పదే విఫలమవుతున్నా సంజూకు మాత్రం ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో వన్డే సిరీస్ లో అయినా సంజూను ఆడిస్తారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. 

 

అయ్యర్  మెరిసేనా..? 

వీరితో పాటు  ఎన్ని అవకాశాలిచ్చినా విఫలమవుతున్న మరో ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. ప్రతిభ ఉన్నా అవకాశాలిస్తున్నా అతడు మాత్రం  విఫలమవుతున్నాడు. పృథ్వీ షా, సర్ఫరాజ్ వంటి ఆటగాళ్లు దేశవాళీలో మెరుస్తుండటంతో  అయ్యర్ ఆట కూడా  పరిశీలనలో ఉండనుంది.  ఈ సిరీస్ లో రాణించకుంటే అయ్యర్ పై వేటు తప్పదు..!

జట్టు ఎంపికలో తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ ధావన్ లకు తలనొప్పులు తప్పేలా లేవు. ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై వాళ్లిద్దరూ మల్లగుల్లాలు పడుతున్నారు. 

- నవంబర్  25న  జరుగనున్న తొలి వన్డే భారత కాలమానం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 
- అమెజాన్ ప్రైమ్ లో ఈ వీడియో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. 

 

భారత జట్టు అంచనా : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ హుడా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ 

Follow Us:
Download App:
  • android
  • ios