భారత దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్2 ప్రయోగం సక్సెస్‌ఫుల్ గా పూర్తయింది. చంద్రుడిపై పరిశోధనలు జరపడానికి పూర్తి స్వదేశీ సాంకేతికతను మాత్రమే ఉపయోగించి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇలా భారత పరిశోధనా రంగంలో మరో మైలురాయిని చేరుకున్న ఇస్రోపై రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు యావత్ భారతదేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ వినూత్నమైన ట్వీట్ తో చంద్రయాన్ ప్రయోగంపై స్పందించాడు.  

భజ్జీ ట్వీట్

'' కొన్ని దేశాలు తమ జాతీయ పతాకాలపై చంద్రుడి బొమ్మను కలిగివుంటాయి(ఆయా దేశాలు జాతీయ జెండాలను చూపిస్తూ). కానీ కొన్ని దేశాలు మాత్రమే ఆ చంద్రుడిపైనే తమ  జెండాను వుంచగలిగాయి. (  అమెరికా,రష్యా,  ఇండియా, చైనా జాతీయ  జెండాలను ప్రదర్శిస్తూ).'' అంటూ భజ్జీ కాస్త  వెరైటీగా చంద్రయాన్2 ప్రయోగం గురించి చమత్కరించాడు. 

వ్యతిరేకించేవారు వాదన

అయితే అతడి ట్వీట్ కు మిశ్రమ  స్పందన లభిస్తోంది. భారతీయులు భజ్జీ ట్వీట్ కు పాజిటివ్ గా రియాక్ట్ కాగా, కొంతమంది మాత్రం కావాలనే ఓ మతానికి చెందిన దేశాలనే అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ  క్రికెటర్ గా కొనసాగుతున్న హర్భజన్ ఇంత కుచించుకుపోయిన మనస్తత్వంతో ఆలోచిస్తాడని తాము అనుకోలేదని కామెంంట్ చేస్తున్నారు. 

మద్దతిస్తున్న వారి వాదన

ఇక ఇలాంటి తన దేశంపై అమితమైన ప్రేమతోనే హర్భజన్ ఈ ట్వీట్ చేశాడని మరికొందరు సమర్ధిస్తున్నారు. చంద్రయాన్2 వంటి ప్రతిష్టాత్మక ప్రయోగం ద్వారా భారత జెండా చంద్రుడిపైకి చేరిందని చెప్పడమే అతడి ఉద్యేశ్యమని వివరణ ఇస్తున్నారు. ఓ మతాన్ని, కొన్ని దేశాలను కించపరిచడానికే భజ్జీ ఈ ట్వీట్ చేశాడని తాము భావించడం లేదని అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.