రిషబ్ పంత్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ... దూకుడుగా మొదలెట్టి, పవర్ ప్లే ముగిసిన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన భారత జట్టు... ఆరంగ్రేట బౌలర్ గ్లీన్‌కి  3 వికెట్లు...

మ్యాచులు మారుతున్నా, విరాట్ కోహ్లీ ఆటతీరు మాత్రం మారడం లేదు. గత దశాబ్దంలో అసాధారణ ఆటతీరుతో సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లీ నుంచి మళ్లీ ఆ రేంజ్ పర్ఫామెన్స్ చూడాలనే అభిమానుల కోరిక తీరడం లేదు. టీ20ల్లో వరుస ఫెయిల్యూర్‌తో తుదిజట్టులో చోటునే ప్రశ్నార్థకంగా మార్చుకున్న విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్. మిడిల్ ఆర్డర్‌లో ఫెయిల్ అవుతున్న రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ భారత జట్టు తీసుకున్న నిర్ణయం... బాగానే వర్కవుట్ అయినట్టు కనిపించింది...

ఓ ఎండ్‌లో రిషబ్ పంత్, మరో ఎండ్‌లో రోహిత్ శర్మ వరుస బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. తొలి ఓవర్‌లో 1 పరుగు వద్ద జాసన్ రాయ్, జోస్ బట్లర్ క్యాచులు డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ.. బౌండరీలు బాదడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు...

డేవిడ్ విల్లే వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ ఓ సిక్సర్, రిషబ్ పంత్ రెండు ఫోర్లు బాది 17 పరుగులు రాబట్టారు. గ్లీసన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన రోహిత్ శర్మ, టీ20ల్లో 300 ఫోర్లను బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్ రోహిత్ శర్మ...

ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ టీ20ల్లో 300+ బాదిన మొదటి క్రికెటర్‌గా ఉండగా విరాట్ కోహ్లీ 298 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో 100కి పైగా సిక్సర్లు, 300+ ఫోర్లు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

 34 ఏళ్ల 219 రోజుల వయసులో టీ20 ఆరంగ్రేటం చేసిన ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్, మొదటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ వికెట్ తీసి టీమిండియాకి షాక్ ఇచ్చాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా 6, 4 బాది 12 పరుగులు రాబట్టాడు రిషబ్ పంత్. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది భారత జట్టు. ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన విరాట్ కోహ్లీ 3 బంతుల్లో 1 పరుగు చేసి డేవిడ్ మలాన్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఇంగ్లాండ్‌పై గత ఐదు టీ20ల్లో మూడు సార్లు 70+ స్కోర్లు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, రెండోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యాడు...

15 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన రిషబ్ పంత్, జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో 49/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, 61/3 స్కోరుకి చేరుకుంది. 34 ఏళ్ల రిచర్డ్ గ్లీసన్, నాలుగు బంతుల వ్యవధిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లను అవుట్ చేసి... టీ20 కెరీర్‌కి అదిరిపోయే ఆరంభం అందుకున్నాడు...