అంతర్జాతీయ క్రికెట్లో రోజురోజుకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ ను సరైన మార్గంలో నడిపించేందుకు కఠిన నిబంధనలెన్నో ప్రస్తుతం అమలవుతున్నాయి. అయినప్పటికి మ్యాచ్ పిక్సింగ్ భూతం మాత్రం క్రికెట్ ను వీడటం లేదు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు బుకీల వలలో పడి తమ కెరీర్ ను రిస్క్ లో పడేసుకోవడమే కాదు క్రికెట్ క్రీడకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. దీన్ని రూపుమాపడానికి ఐసిసి తో పాటు ఆయా దేశాల క్రికెట్ అసోసియేషన్స్ ఎంత ప్రయత్నించినా ఫలితంలేకుండా పోతోంది. తాజాగా టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

ఇటీవల జరిగిన తమిళనాడు, కర్ణాటక ప్రీమియర్ లీగుల్లో మ్యాచ్ పిక్సింగ్ జరిగినట్లు వస్తున్న ఆరోపణలు భారత క్రికెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవాస్కర్ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మాట్లాడుతూ...ఇది కేవలం భారత క్రికెట్ నే కాదు అన్ని అంతర్జాతీయ జట్లను వేదిస్తున్న సమస్య. ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా ఆటగాళ్లను మ్యాచ్ పిక్సింగ్ కు దూరంగా వుంచడంలో క్రికెట్ సంఘాలు విఫలమవుతున్నాయి. దేశ ప్రతిష్ట కంటే బుకీల నుండి  కష్టపడకుండానే వచ్చే డబ్బులే కొందరు ఆటగాళ్లను ఆకట్టుకుంటున్నాయి. అందువల్లే తరచూ అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ భూతం పడగవిప్పుతోందని గవాస్కర్ తెలిపారు. 

''క్రికెటర్లు కూడా మనుషులే. వారిలో కూడా కొందరికి అత్యాశ వుండటం సహజమే. అలాంటి వారు బుకీల వలలో పడుతున్నారు. ఇలా మ్యాచ్ పిక్సింగ్ కు పాల్పడేవారిలో ముందునుంచే ధనికులైన ఆటగాళ్ళు, పేద కుటుంబ నేపథ్యమన్న ఆటగాళ్లు వుంటున్నారు. కాబట్టి ఫిక్సింగ్ కు ఆటగాళ్ల అత్యాశే ముఖ్య కారణమని స్పష్టంగా తెలుస్తోంది. 

ముఖ్యంగా యువ క్రికెటర్లు బుకీల వలలో పడే అవకాశం ఎక్కువగా వుంటుంది. కాబట్టి అధికారులు వారు అటువైపు ఆకర్షితులు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. దీనివల్ల కూడా మ్యాచ్ పిక్సింగ్ పూర్తిగా దూరమైతుందని అనుకోవడం లేదు. కానీ కాస్తయినా తగ్గుతుంది. దీన్ని క్రికెట్ నుండి పూర్తిగా నివారించడం సాధ్యమయ్యే పని కాదు.'' అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.