భారత యువ క్రికెటర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదేసి సంచలనం సృష్టించాడు.

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కేరళ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న శాంసన్.. గోవాతో జరిగిన మ్యాచ్‌లో 129 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 212 పరుగులు చేశాడు.

తద్వారా లిస్ట్ ఏ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో అత్యథిక పరుగులు సాధించిన ఆటగాడిగా శాంసన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్తాన్‌కు చెందిన అబిద్ అలీ పేరిట ఉండేది.

పాకిస్తాన్ నేషనల్ వన్డే కప్‌లో భాగంగా ఇస్లామాబాద్ తరపున ఆడిన అలీ పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో అబిద్ 209 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మరోవైపు సంజూ వీర విహారంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గోవా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి ఓటమి పాలైంది.