మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ మృతికి టీమిండియా ఆటగాళ్ళు సంతాపం ప్రకటించారు. భారత క్రికెట్ వ్యవహారాల్లో గతంలో చురుగ్గా పాల్గొని దాని అభివృద్దికి పాటుపడినందుకు గానూ అతడికి తగిన గౌరవంతో వీడ్కోలు పలికారు. వెస్టిండిస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. జైట్లీ మృతికి సంతాపంగా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించినట్లు బిసిసిఐ వెల్లడించింది. 

ఈ సందర్భంగా ఇండియన్ క్రికెట్ తో జైట్లీకి వున్న అనుబంధాన్ని బిసిసిఐ గుర్తుచేసుకుంది. గతంలో ఆయన  సుధీర్ఘకాలం డిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా,య బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా క్రికెట్ అభివృద్దికి పాటుపడ్డాడని తెలిపింది. మరీముఖ్యంగా అతడు డిడిసీఏ అధ్యక్షుడిగా వున్నపుడే వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు డిల్లీ తరపున ఆడారు. వీరిని గుర్తించడంలో, మంచి అవకాశాలు కల్పించి ప్రోత్సహించడంలో అరుణ్ జైట్లీ ముందున్నాడు. కేవలం వీరే కాదు జైట్లీ హయాంలో వెలుగులోకి  వచ్చిన ఆటగాళ్లు చాలామంది వున్నారు. 

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీంతో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులే కాకుండా యావత్ దేశ ప్రజలు సంతాపం ప్రకటించారు. ఇక స్వతహాగా క్రికెట్ తో మంచి సంబంధాలు కలిగివున్న ఆయన మరణం పట్ల భారత జట్టే కాదు బిసిసిఐ అధికారులు సంతాపం ప్రకటించారు. 

బిసిసిఐ అధ్యక్షులు సీకే ఖన్నా తాను మంచి ఆత్మీయున్ని కోల్పోయానని ఆవేధన వ్యక్తం చేశాడు. ఆయన మరణం దేశానికే కాదు క్రికెట్ కు తీరని లోటన్నారు. భారత క్రికెట్ కు ఎంతో సేవ చేసిన జైట్లీ మృతికి తాను ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే హైదరబాదీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, డిల్లీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా జైట్లీ మృతిపై ఆవేధన వ్యక్తం చేశారు.