Asianet News TeluguAsianet News Telugu

వాళ్లు ఇలా! వీళ్లు భళా... ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా నయా చరిత్ర... చితక్కొట్టిన హర్మన్‌ప్రీత్...

హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు సెంచరీ... రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ని చిత్తు చేసిన భారత మహిళా జట్టు... 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ కైవసం...

Team India beats England in wins ODI series after 2 decades, Harmanpreet kaur century
Author
First Published Sep 22, 2022, 9:55 AM IST

టీమిండియా ఆసియా కప్ 2022 నుంచి సరైన రిథమ్‌లోకి రావడానికి అష్టకష్టాలు పడుతోంది. పాకిస్తాన్‌పై 180+, శ్రీలంకపై 170+ పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులు ఎత్తేసిన రోహిత్ సేన, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 200+ పరుగులు చేసినా పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే భారత మహిళా జట్టు మాత్రం రికార్డు విజయం సాధించింది. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది భారత మహిళా జట్టు...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 333 పరుగుల భారీ స్కోరు చేసింది. షెఫాలీ వర్మ 7 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసి కేట్ క్రాస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా యషికా భాటియా 34 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసింది...

మొదటి వన్డేలో సెంచరీ మిస్ చేసుకున్న స్మృతి మంధాన 51 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి అవుటైంది. 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్ కలిసి నాలుగో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 72 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసిన హర్లీన్ డియోల్‌ని లారెన్ బెల్ అవుట్ చేసింది...

పూజా వస్త్రాకర్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేయగా దీప్తి శర్మ 9 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసింది. 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, సెంచరీ తర్వాత బౌండరీల మోత మోగించింది. సెంచరీ తర్వాత 11 బంతుల్లో 43 పరుగులు రాబట్టింది హర్మన్‌ప్రీత్. 

సెంచరీ తర్వాత వరుసగా 6,4,4,6,4,1,6,4,4,4,0 బాదిన హర్మన్‌ప్రీత్ కౌర్, 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కి వన్డేల్లో ఇది ఐదో సెంచరీ కాగా ఈ ఏడాది భారత జట్టు తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా నిలిచిందామె...

ఇంగ్లాండ్ బౌలర్లు అందరూ పదేసి ఓవర్లు వేసి, తలా ఓ వికెట్ తీశారు. 334 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ వరుస వికెట్లు కోల్పోయింది. 6 పరుగులు చేసిన టమ్మీ బేమోంట్‌ని హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ చేయగా సోఫియా డంక్లీ 1, ఎమ్మా లంబ్ 15 పరుగులు చేసి రేణుకా సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.

అలీసా కాప్సీ 39, డానెల్లీ వ్యాట్ 65, అమీ జోన్స్ 39 పరుగులు చేయగా ఫియా కెంప్ 12 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. సోఫి ఎక్లేస్టోన్ 1, చార్లోట్ డీన్ 37 పరుగులు చేయగా కేట్ క్రాస్ 14 పరుగులు చేసింది. 44.2 ఓవర్లలో 245 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ జట్టు 88 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 

భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా దీప్తి శర్మ, షెఫాలీ వర్మ చెరో వికెట్ తీశారు. దయాలన్ హేమలత 2 వికెట్లు తీశారు. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ గెలిచిన భారత మహిళా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు క్రియేట్ చేసింది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే సెప్టెంబర్ 24న శనివారం లార్డ్స్ మైదానంలో జరగనుంది. భారత వెటరన్ బౌలర్ జులన్ గోస్వామికి ఇదే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios