Asianet News TeluguAsianet News Telugu

ప్రాక్టీస్ మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ... షమీ మ్యాజిక్‌తో ఆస్ట్రేలియాపై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ...

ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న టీమిండియా... ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసిన మహ్మద్ షమీ... 

Team India beats Australia in T20 World cup 2022 Warm-up match
Author
First Published Oct 17, 2022, 1:03 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాని ఇబ్బంది పెడుతున్న విషయం బౌలింగ్. అయితే మహ్మద్ షమీ రీఎంట్రీ ఆ లోటునే తీర్చేలాగే కనబడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసిన మహ్మద్ షమీ, భారత జట్టుకి 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందించాడు. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసిన మహ్మద్ షమీ బౌలింగ్ కారణంగా ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు చేయలేకపోయింది ఆస్ట్రేలియా. 187 పరుగుల లక్ష్యఛేదనలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఆసీస్....

మిచెల్ మార్ష్, ఆరోన్ ఫించ్ కలిసి తొలి వికెట్‌కి 41 పరుగులు జోడించారు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, భువీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని యజ్వేంద్ర చాహాల్ అవుట్ చేయగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. మార్కస్ స్టోయినిస్ 7 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్ట్ అయ్యాడు. అయితే  ఫించ్ అవుట్ అయ్యే సమయానికి 11 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది ఆస్ట్రేలియా... 

ఆ తర్వాతి బంతికే టిమ్ డేవిడ్‌ని విరాట్ కోహ్లీ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. 19 వ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన హర్షల్ పటేల్, కీలకమైన ఆరోన్ ఫించ్ వికెట్ తీశాడు. ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చాయి. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసేందుకు మహ్మద్ షమీని తీసుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. తొలి బంతికి 2 పరుగులు రాగా రెండో బంతికి కూడా 2 పరుగులు వచ్చాయి. మూడో బంతికి ప్యాట్ కమ్మిన్స్ అవుట్ అయ్యాడు...

నాలుగో బంతికి అస్టన్ అగర్ రనౌట్ అయ్యాడు. ఐదో బంతికి జోష్ ఇంగ్లీష్‌ని షమీ బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి రిచర్డ్‌సన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన షమీ... భారత జట్టుకి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తొలి వికెట్‌కి కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి 78 పరుగుల భాగస్వామ్యం అందించారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అస్టన్ అగర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ కాగా హార్ధిక్ పాండ్యా 5 బంతులాడి 2 పరుగులే చేసి నిరాశపరిచాడు. దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 2 బంతుల్లో ఓ సిక్సర్‌తో 6 పరుగులు చేశాడు...

సూర్యకుమార్ యాదవ్ తన స్టైల్‌లో ఫామ్‌ని కొనసాగిస్తూ 33 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 6 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్‌  4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా గ్లెన్ మ్యాక్స్‌వెల్, అస్టన్ అగర్, మిచెల్ స్టార్క్‌ ఒక్కో వికెట్ తీశారు...

Follow Us:
Download App:
  • android
  • ios