వెన్నుగాయంతో టీమ్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్... అయ్యర్ స్థానంలో రజత్ పటిదార్‌కి చోటు కల్పించిన సెలక్టర్లు.. 

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడని తేలడంతో అతన్ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపిస్తున్నట్టు తెలియచేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...

శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఆర్‌సీబీ బ్యాటర్ రజత్ పటిదార్‌కి జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సెంచరీ చేసి వెలుగులోకి వచ్చిన రజత్ పటిదార్, దేశవాళీ టోర్నీల్లో మంచి పర్ఫామెన్స్ కనబరిచి సెలక్టర్లను మెప్పించాడు...

Scroll to load tweet…

అయితే జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఉండడంతో రజత్ పటిదార్‌కి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచుల్లో 94 పరుగులు చేశాడు శ్రేయాస్ అయ్యర్...

గత ఏడాది టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్.. టీ20ల్లో అదరగొడుతున్నా వన్డేల్లో వరుసగా విఫలమవుతూ టీమ్‌లో చోటు కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్‌ది ఇది లక్కీ ఛాన్స్. సూర్య వన్డేల్లో కూడా టీ20 రేంజ్ మెరుపులు చూపించి సెటిల్ అయితే... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి తిరుగు ఉండదు..

ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయాలతో టీమ్‌కి దూరం కాగా కెఎల్ రాహుల్‌తో పాటు అక్షర్ పటేల్ వ్యక్తిగత కారణాలతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కి దూరంగా ఉన్నారు. కెఎల్ రాహుల్, వచ్చే వారంలో పెళ్లి చేసుకోబోతుండగా అక్షర్ పటేల్ ఎందుకు లీవ్ తీసుకున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు...

శ్రేయాస్ అయ్యర్ దూరం కావడంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి టీమిండియా ఇలా ఉంది: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కెఎస్ భరత్, వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, రజత్ పటిదార్