TATA IPL 2022 - LSG vs DC: ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో మరో గెలుపు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈజీ టార్గెట్ అయినా మ్యాచ్ ఆఖరి ఓవర్ దాకా ఫలితం తేలలేదు.
ఉత్కంఠభరితంగా సాగిన లో స్కోరింగ్ గేమ్ లో లక్నో సూపర్ జెయింట్స్ నే విజయం వరించింది. ఢిల్లీ లాగే ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్.. మధ్య ఓవర్లలో నెమ్మదిగా ఆడటంతో ఆ జట్టు అతి కష్టం మీద విజయాన్ని అందుకోవాల్సి వచ్చింది. డెత్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసిరి లక్నోను కట్టడి చేశారు. అయితే కీలక ఇన్నింగ్స్ ఆడిన లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్.. ఆఖర్లో బ్యాట్ ఝుళిపించిన కృనాల్ పాండ్యా తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆ జట్టుకు వరుసగా మూడో విజయాన్ని అందించాడు. ఇది ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి. ఢిల్లీకి తురుపు ముక్కగా భావించిన ఆన్రిచ్ నోర్త్జ్ భారీగా పరుగులిచ్చుకున్నాడు.
స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించారు ఆ జట్టు ఓపెనర్లు కెఎల్ రాహుల్ (25 బంతుల్లో 24.. 1 ఫోర్, 1 సిక్సర్), క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 80.. 9 ఫోర్లు, 2 సిక్సర్లు). ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 9.4 ఓవర్లలోనే 73 పరగులు జోడించారు. ముఖ్యంగా తొలి మూడు మ్యాచులలో అంతగా రాణించని డికాక్.. శార్దూల్ ఠాకూర్ వేసిన 3వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టి, నోర్త్జ్ వేసిన 5వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో పాటు సిక్సర్ బాదాడు. ఆ ఓవర్లో 19 పరుగులు పిండుకున్నాడు.
ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ ఢిల్లీకి తొలి బ్రేకిచ్చాడు. పదో ఓవర్ లో నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయిన కెఎల్ రాహుల్.. లాంగాఫ్ లో ఉన్న పృథ్వీ షా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
12వ ఓవర్ వేసిన కుల్దీప్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి డికాక్ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. అయితే తర్వాత ఓవర్లో లలిత్ యాదవ్.. ఎవిన్ లూయిస్ (5) ను ఔట్ చేసి రెండో వికెట్ పడగొట్టాడు. కానీ ఆ క్షణంలో వచ్చిన దీపక్ హుడా (13 బంతుల్లో11) తో కలిసి డికాక్ మూడో వికెట్ కు 36 పరుగులు జోడించాడు. అయితే ఈ జోడీని 15వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ విడదీశాడు.
14వ ఓవర్ దాకా ధాటిగా ఆడిన లక్నో.. ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. క్రీజులో డికాక్, హుడాలు ఉన్నా ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో స్కోరు లో వేగం తగ్గింది. 16 ఓవర్లకు లక్నో స్కోరు 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు. కానీ అప్పటికే డికాక్ నిష్క్రమించడంతో పాటు ఢిల్లీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసరడంతో మ్యాచులో డ్రామా మొదలైంది. ఈ క్రమంలో 17వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్.. 4 పరుగులే ఇచ్చాడు. 18వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ 5 పరుగులే ఇచ్చాడు. అప్పటికీ లక్నో.. 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉంది.
కానీ 19వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్.. ఆ ఓవర్లో 14 పరగులిచ్చాడు. కృనాల్ పాండ్యా (14 బంతుల్లో 19 నాటౌట్. 1 సిక్సర్) .. సిక్సర్ తో పాటు వరుసగా మూడు డబుల్స్ తీశాడు. ఇక 20వ ఓవర్ వేసిన శార్దూల్.. తొలి బంతికే హుడా ను ఔట్ చేసి ఢిల్లీ శిబిరంలో కాస్త ఆశలు పెంచాడు. కానీ లక్నో యువ కెరటం ఆయుష్ బదోని (3 బంతుల్లో 10 నాటౌట్. 1 ఫోర్, 1 సిక్సర్) తర్వాత బంతికే ఫోర్, సిక్సర్ కొట్టి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ పృథ్వీ షా (34 బంతుల్లో 61... 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆటే హైలైట్. పవర్ ప్లే లో భారీ హిట్టింగ్స్ తో స్కోరుబోర్డును రాకెట్ వేగంతో ముందుకు నడిపించాడు షా. అయితే షా నిష్క్రమించాక ఢిల్లీ స్కోరు నెమ్మదించింది. వార్నర్ (12 బంతుల్లో 4), రొమెన్ పావెల్ (3) లు వెంటవెంటనే ఔటయ్యారు.
మిడిల్ ఓవర్స్ లో లక్నో స్పిన్నర్లు కట్టడి చేయడంతో ఢిల్లీకి పరుగులు రావడమే గగనంగా మారింది. రిషభ్ పంత్ (36 బంతుల్లో 39 నాటౌట్.. 3 ఫోర్లు, 2 సిక్సులు), సర్ఫరాజ్ ఖాన్ (28 బంతుల్లో 36 నాటౌట్.. 3 ఫోర్లు) లు చివరి ఓవర్ దాకా ఉన్నా నెమ్మదిగా ఆడటంతో ఢిల్లీ భారీ స్కోరు చేయలేకపోయింది.
