TATA IPL 2022- MI Vs CSK: వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి.  సీజన్ లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్.  ఏ జట్టైనా బాధ్యతగా ఆడుతుంది. కానీ ఐదు సార్లు ఛాంపియన్ మాత్రం  ఈ సీజన్ లో గత ఆరు మ్యాచుల మాదిరిగానే విఫలైమంది. 

ఆడుతున్నది కీలక మ్యాచ్. ఎదుట బలమైన ప్రత్యర్థి. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఓవర్లోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టగా.. ఆ తర్వాత మిడిలార్డర్ కూడా అదే బాటను అనుసరించింది. పేరుకు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప బ్యాటర్లు అని పేరున్నా.. అత్యంత చెత్త ఆటతీరుతో దారుణంగా విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో.. 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేశారు. ముంబై ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే దానికి కారణం మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దయే. అతడు కూడా ఆడకుంటే ముంబై కథ అంతకుముందే ముగిసేది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ముంబై ఇండియన్స్.. తొలి ఓవర్లోనే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ముఖేశ్ చౌదరి వేసిన తొలి ఓవర్ రెండో బంతికే రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. అదే ఓవర్లో ఐదో బంతికి ఇషాన్ కిషన్ కూడా బౌల్డయ్యాడు. స్కోరు బోర్డుపై 2 పరుగులు చేరకుండానే ముంబై రెండు వికెట్లను కోల్పోయింది. 

గత రెండు మ్యాచులలో కాస్త మెరపులు మెరిపించిన డెవాల్డ్ బ్రెవిస్ (4) ఆదుకుంటాడేమో అనుకున్న ముంబై అభిమానుల ఆశలను అడియాసలు చేస్తూ.. అతడు కూడా ముఖేశ్ చౌదరి వేసిన మూడో ఓవర్లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 3 ఓవర్లలో 23 పరుగులకే 3 వికెట్లు. 

ఈ క్రమంలో తిలక్ వర్మ (43 బంతుల్లో 51.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తో జతకలిసిన సూర్య కుమార్ యాదవ్ (21 బంతుల్లో 32.. 3 ఫోర్లు, 1 సిక్సర్) కాస్త మెరుపులు మెరిపించాడు. వీళ్లిద్దరూ కలిసి వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకోగలిగారు. అయితే సూర్యను సాంట్నర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కొత్త కుర్రాడు హృతిక్ షోకీన్ (25) కాసేపు ప్రతిఘటించినా క్రీజులో నిలువలేకపోయాడు. బ్రావో వేసిన 14వ ఓవర్లో అతడు కూడా నిష్క్రమించాడు. 

Scroll to load tweet…

హృతిక్ స్థానంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (14) ఏమైనా మెరుపులు మెరిపించి ముంబై స్కోరు ను పెంచుతాడనుకుంటే అతడు కూడా విఫలమయ్యాడు. అయితే వరుసగా వికెట్లు కోల్పోతున్నా తిలక్ వర్మ మాత్రం నిలకడగా ఆడాడు. ప్రిటోరియస్ వేసిన 19వ ఓవర్లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముంబై ఆ మాత్రం స్కోరైనా సాధించందటే అతడి చలవే. ఇక బ్రావో వేసిన ఆఖరి ఓవర్లో ఉనద్కత్ (9 బంతుల్లో 19.. 1 ఫోర్, 1 సిక్సర్) మెరుపులు తోడవడంతో ముంబై కాస్త మెరుగైన స్కోరు సాధించింది.

సీఎస్కే బౌలర్లలో ముఖేశ్ చౌదరి 3 వికెట్లతో చెలరేగగా... డ్వేన్ బ్రావో కు రెండు వికెట్లు దక్కాయి. సాంట్నర్, మహేశ్ తీక్షణ కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఫీల్డింగ్ చెత్తగా సాగింది. ఆ జట్టు రవీంద్ర జడేజా తో పాటు పలువురు ఫీల్డర్లు కీలక క్యాచ్ లు వదిలేశారు. బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ల క్యాచులు మిస్ అయ్యాయి.