టీ20 వరల్డ్ కప్ లో చరిత్రాత్మక విజయం ... కెప్టెన్ రషీద్ కు తాలిబన్ మంత్రి వీడియో కాల్... ఏమన్నారో తెలుసా..?
అప్ఘానిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయే ప్రదర్శనను ఈ ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో కనబరుస్తున్నారు ఆ దేశ ఆటగాళ్లు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ఆటగాళ్లతో కూడిన జట్లకు సాధ్యంకాని విజయాలు అప్ఘాన్ కు దక్కాయి. దీంతో ఆ టీం సెమీస్ కు చేరి ట్రోపీకి మరింత దగ్గరయ్యింది.
ICC T20 World Cup : టీ20 ప్రపంచ కప్ 2024 లో అద్భుతాలు జరుగుతున్నాయి. పసికూనలు అనుకుని ఈజీగా తీసుకున్న జట్లు పటిష్టమైన టీంలను సైతం మట్టికరిపించడం చూస్తున్నాం. ఇలా అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న అప్ఘానిస్తాన్ బంగ్లాదేశ్ పై విజయంతో సెమీస్ కు చేరింది. ఇలా ఐసిసి మెగా టోర్నీలో విజయం వైపు దూసుకుపోతున్న అప్ఘాన్ టీంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సూపర్ 8 లో భాగంగా బంగ్లాదేశ్ తో తలపడ్డ అప్ఘాన్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. దీంతో అప్ఘాన్ జట్టు భారత్ సరసన చేరింది. ఇటీవల ఆస్ట్రేలియాను ఓడించి గ్రూప్ 1 నుండి టీమిండియా ఇప్పటికే సెమీస్ కు చేరింది... తాజాగా బంగ్లాపై విజయంతో అప్ఘాన్ కూడా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇలా అత్యుత్తమ ఆటతీరుతో టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటుతున్న అప్ఘాన్ క్రికెటర్లకు ఆ దేశ తాలిబన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకీ అభినందించారు.
బంగ్లాదేశ్ పై థ్రిల్లింగ్ విక్టరీ అనంతరం అప్ఘానిస్థాన్ టీం కెప్టెన్ రషీద్ ఖాన్ కు విదేశాంగ మంత్రి వీడియో కాల్ చేసారు. తాలిబన్ ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలందరి తరపున అప్ఘాన్ క్రికెటర్లందరికీ అభినందనలు తెలియజేసారు. ఈ విజయపరంపరను కొనసాగించి ఐసిసి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలా తమకు అభినందనలు తెలిపిన అమీర్ ఖాన్ కు రషీద్ ఖాన్ దన్యవాదాలు తెలిపారు.
ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరిన జట్లివే :
ఐసిసి టీ20 ప్రపంచ కప్ సంచలనాలకు వేదికయ్యింది. పటిష్టమైన పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక,వెస్టిండిస్ వంటి జట్లకు సాధ్యంకానిది పసికూన అప్థాన్ తో సాధ్యమయ్యింది. ఇప్పటికే ఈ జట్లన్ని టీ20 ప్రపంచకప్ నుండి వైదొలగగా అప్ఘానిస్తాన్ టీం మాత్రం టైటిల్ రేసులో నిలిచింది. సూపర్ 8 లో బంగ్లాదేశ్ పై విజయంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.
ఇక ఈ టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ రేసులో ముందుంది టీమిండియా. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచుల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించారు భారత క్రికెటర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్... అన్ని విభాగాల్లో రాణించిన రోహిత్ సేన ఇప్పటికే సెమీస్ కు చేరింది.
ఇక ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు కూడా సెమీస్ కు చేరాయి. సెమీస్ కు చేరిన నాలుగు జట్లలో టీమిండియాకు ఫైనల్ కు చేరే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఇక అప్ఘాన్ టీం సెమీస్ లోనూ రాణించి ఫైనల్ కు చేరిందంటే చరిత్రే. ఇదే కోరుకుంటున్నారు అప్ఘాన్ క్రికెట్ ఫ్యాన్స్. ఏదేమైనా ఇకపై ప్రపంచ కప్ టోర్నీ మరింత రసవత్తరంగా సాగనుంది.