Namibia vs Netherlands: నమీబియా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన పోరులో నమీబియా ఘన విజయం సాధించింది. గ్రూప్-బీలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో ఓడిన నెదర్లాండ్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుని సూపర్-12 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup) అర్హత రౌండ్లలో భాగంగా నమీబియా-నెదర్లాండ్స్ (Namibia Vs Netherlands)మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో నమీబియా (Namibia) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్-బీలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో ఓడిన నెదర్లాండ్స్ (Netherlands) వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుని సూపర్-12 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక గత మ్యాచ్ లో శ్రీలంకతో ఓడిన నమీబియా.. నేటి మ్యాచ్ లో పుంజుకుంది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టులో డేవిడ్ వీస్ (David wiese) మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ మాక్స్ ఒడౌడ్ (max odowd).. 56 బంతుల్లో 70 పరుగులతో ఇరగదీశాడు. మరో ఓపెనర్ మైబర్గ్ (17) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయాడు. అతడు ఔటయ్యాక వచ్చిన వాన్ డర్ మెర్వ్ (6) కూడా త్వరగానే నిష్ర్కమించాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన అకర్మన్.. 32 బంతుల్లో 35 పరుగులతో అలరించాడు. అతడికి వికెట్ కీపర్ స్కాట్ ఎడ్వర్డ్స్ (21) జతకలవడంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లకు భారీ స్కోరు సాధించింది. నమీబియా బౌలర్లలో జన్ ఫ్రిలింక్ 2 వికెట్లు పడగొట్టాడు.
165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నమీబియాకు ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (19), జేన్ గ్రీన్ (15) శుభారంభాన్నే ఇచ్చారు. కానీ వారిద్దరూ వెంట వెంటనే నిష్క్రమించారు. వన్ డౌన్ లో వచ్చిన క్రెయిగ్ విలియమ్స్ (11)కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గెర్హర్డ్ ఎరస్మస్ (22 బంతుల్లో 32) కు జత కలిసిన డేవిడ్ వీస్ (40 బంతుల్లో 66) హాఫ్ సెంచరీతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు. వీస్ మెరుపు ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి.
నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాస్సెన్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన అతడు.. 14 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అకర్మన్, టిమిమ్, కెప్టెన్ సీలార్ కు తలో వికెట్ దక్కింది.
గ్రూప్-బిలో ఉన్న నెదర్లాండ్స్, నమీబియాలు ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడగా అవి ఓడిపోయాయి. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో నమీబియా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ ఆడిన రెండింటిలోనూ పరాజయం పాలైంది.
