జూన్ 4 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024! ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు చేయక తప్పదా...
వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ... మార్చి 11 వరకూ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతున్న భారత జట్టు... ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు చేయక తప్పని పరిస్థితి...
టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ. అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగబోతుంటే, వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగనుంది. వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏ, సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి వేదిక ఇవ్వబోతున్నాయి..
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం 10 వేదికలు ఖరారు చేశారు. ఇందులో యూఎస్‌ఏలో నాలుగు వేదికలు, వెస్టిండీస్‌లో ఆరు వేదికలు ఉండబోతున్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మొట్టమొదటిసారి 20 దేశాలు పాల్గొనబోతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 20 దేశాలు పాల్గొనడం ఇదే మొదటిసారి..
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీకి వేదిక ఇస్తున్న డల్లాస్, మోర్రీస్‌విల్లే నగరాలను వరల్డ్ కప్ కోసం షార్ట్ లిస్ట్ చేశారు. వచ్చే నెలలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరిగే ఫోర్లిడా లాడేహిల్ కూడా టీ20 వరల్డ్ కప్ 2024 కోసం షార్ట్ లిస్ట్ చేయబడింది.
ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫైయర్స్ నుంచి పపువా న్యూ గినియా, జపాన్, యూరప్ క్వాలిఫైయర్స్ నుంచి ఐర్లాండ్, స్కాట్లాండ్... టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అర్హత సాధించాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక... ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అర్హత సాధించాయి. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా ఐసీసీ టీ20 స్టాండింగ్స్‌లో టాప్‌లో నిలవడంతో పొట్టి ప్రపంచ కప్ 2024 టోర్నీ ఆడబోతున్నాయి.
వీటితో పాటు ఆసియా నుంచి మరో రెండు దేశాలు, ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి ఓ జట్టు... టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో పాల్గొనబోతున్నాయి.
జూన్ 4 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ టోర్నీ, జూన్ 30న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. గ్రూప్ స్టేజీలో నాలుగు గ్రూప్‌లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో ఐదేసి జట్లు ఉంటాయి. వీటిల్లో టాప్‌లో నిలిచిన 8 జట్లు, సూపర్ 8 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. రెండు గ్రూప్‌లుగా జరిగే సూపర్ 8 రౌండ్‌లో టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్ ఆడతాయి..
జూన్ 4 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆరంభం కాబోతుండడంతో ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ ముందుకు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి 11 వరకూ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా. సాధారణంగా మార్చి 30 లేదా ఏప్రిల్ 1న ఐపీఎల్ మొదలవుతుంది..
జూన్ మొదటి వారంలో లేదా మే చివర్లో ఐపీఎల్ మ్యాచులు ముగుస్తాయి. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కోసం కనీసం 10-15 రోజులు ముందుగానే ఐపీఎల్ 2024 సీజన్ ముగియనుంది.