టీ20 వరల్డ్ కప్ 2022: ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్... ఓడిపోవాలని ఫ్యాన్స్ పూజలు! ఎందుకంటే...
T20 World cup 2022: టీమిండియాతో వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా...
టీ20 వరల్డ్ కప్ 2022 క్వాలిఫైయర్ రౌండ్స్ ప్రారంభమైపోయాయి. తొలిరోజే ఆసియా కప్ 2022 ఛాంపియన్ శ్రీలంకకు ఊహించని షాక్ ఇచ్చింది పసికూన నమీబియా. నెదర్లాండ్స్, యూఏఈ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగి క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు మజాని అందించింది. నేడు ఆస్ట్రేలియాతో టీమిండయా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది...
టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
అయితే ఈ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవాలని భారత జట్టు అభిమానులు కోరుకుంటుండడం విశేషం. దీనికి కారణం 2021 టీ20 వరల్డ్ కప్ అనుభవాలే. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా అడుగుపెట్టిన భారత జట్టు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగిన రెండు వార్మప్ మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది...
అయితే తీరా అసలు మ్యాచులు మొదలయ్యాక పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లను వార్మప్ మ్యాచుల్లో ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్లు, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో వార్మప్ మ్యాచుల్లో ఓడిపోతేనైనా మనవాళ్లు అసలు మ్యాచుల్లో జాగ్రత్తగా ఆడతారని, తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు సమయాన్ని వాడుకుంటారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అభిమానులు...
రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తూ వస్తున్న భారత జట్టు, ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్, శ్రీలంక చేతుల్లో ఓడి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు మ్యాచ్ విన్నర్లు లేకుండా మెగా టోర్నీ ఆడుతోంది భారత జట్టు...
అదీకాకుండా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ సరైన ఫామ్‌లో లేకపోవడం కూడా టీమిండియా అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇన్ని సమస్యల నడుమ భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ప్రయాణం ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2021 గెలిచి, డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 బరిలో దిగుతోంది ఆస్ట్రేలియా. ఈసారి స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడం ఆస్ట్రేలియాకు మరింత అడ్వాంటేజ్ కానుంది...
వార్మప్ మ్యాచ్‌లో ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌తో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి కూడా తుది జట్టులో చోటు కల్పించలేదు టీమిండియా. దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్‌గా, అక్షర్, అశ్విన్ స్పిన్ బౌలర్లుగా వ్యవహరించబోతున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా జట్టు: గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, అస్టన్ అఘర్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్