T20 World Cup 2022: గతేడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ ఈసారి టోర్నీని  ఓటమితో ఆరంభించింది.  

టీ20 ప్రపంచకప్ - 2022 టోర్నీని కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు ఓటమితో ఆరంభించింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి వార్మప్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సఫారీ స్పిన్నర్లతో పాటు పేసర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 17.1 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనను సఫారీలు 11.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదిపారేశారు. 

బ్రిస్బేన్ లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా జరిగిన వార్మప్ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టెంబ బవుమా కాకుండా ఈ మ్యాచ్ లో సఫారీ జట్టుకు డేవిడ్ మిల్లర్ సారథ్యం వహించాడు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన కివీస్.. సఫారీ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 

సఫారీ పేసర్ పార్నెల్.. తొలి ఓవర్ మూడో బంతికే సూపర్ ఫామ్ లో ఉన్న ఫిన్ అలెన్ (6) ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ (3) ను తన తర్వాతి ఓవర్లో పార్నెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వరుసగా రెండు షాకులు తాకినా మార్టిన్ గప్తిల్ (23 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్సర్), గ్లెన్ ఫిలిప్స్ (18 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్స్) లు కివీస్ శిబిరంలో ఆశలు కల్పించారు. కానీ 7 ఓవర్లో రెండో బంతికి స్పిన్నర్ షంషీ.. ఫిలిప్స్ ను ఔట్ చేశాడు.

Scroll to load tweet…

ఆ తర్వాత షంషీ.. 9.5వ ఓవర్లో చప్మన్ (4) ను కూడా పెవిలియన్ కు పంపాడు. తర్వాత ఓవర్లో మహారాజ్.. గప్తిల్ ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత కివీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 17.1 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 3, షంషీ, పార్నెల్ తలా రెండు వికెట్లు తీశారు. 

స్వల్ప లక్ష్యాన్ని 11.2 ఓవర్లలోనే సఫారీలు ఊది పారేశారు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27) కు తోడు రిలీ రూసో (31 బంతులలో 53 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. 


Scroll to load tweet…