స్కాట్లాండ్ సంచలన విజయం.. మాజీ ఛాంపియన్స్ వెస్టిండీస్‌కూ భారీ షాక్..

T20 World Cup 2022: రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్ గా అవతరించిన  వెస్టిండీస్ ఈసారి క్వాలిఫై రౌండ్ ఆడుతున్నది. నేడు  స్కాట్లాండ్ తో ముగిసిన   మ్యాచ్ లో  వెస్టిండీస్ దారుణంగా  ఓడింది. 

T20 World Cup 2022: Scotland Shocks West Indies, Pooran and Team Lost Crucial Match by 42 Runs

గతేడాది టీ20 ప్రపంచకప్ లో సంచలన విజయాలతో సూపర్ - 12 కు చేరి అందరి ప్రశంసలు దక్కించుకున్న స్కాట్లాండ్.. మరో  అద్భుత విజయాన్ని  అందుకుంది. టీ20 ప్రపంచకప్ లో సూపర్-12లో చేరేందుకు గాను నిర్వహిస్తున్న అర్హత రౌండ్ లో  ఆ జట్టు.. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గిన వెస్టిండీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ముందు బ్యాటింగ్ లో ఆ తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి విండీస్ కు  చుక్కులు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.  బదులుగా విండీస్ 18.3 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో విండీస్.. తర్వాత జరుగబోయే రెండు మ్యాచ్ లను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

హోబర్ట్  వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్  చేసింది. ఆ జట్టులో ఓపెనర్ మున్సే (53 బంతుల్లో 66 నాటౌట్, 9 ఫోర్లు) రాణించాడు.  మరో ఓపెనర్ మైఖేల్ జోన్స్ (20), మెక్‌లియోడ్ (23) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, జేసన్ హోల్డర్ లు తలా రెండు వికెట్లు తీశారు. 

మోస్తారు లక్ష్య ఛేదనలో విండీస్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (13 బంతుల్లో 20,  3 ఫోర్లు, 1 సిక్స్), ఎవిన్ లూయిస్ (14, 1 ఫోర్, 1 సిక్స్)  ధాటిగానే ఆడారు.  అయితే   వీల్ వేసిన 2.4 ఓవర్లో ఎవిన్ లూయిస్ మైఖేల్ కు క్యాచ్ ఇచ్చాడు. బ్రాండన్ కింగ్ (17) మూడు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించినా మార్క్ వాట్ అతడిని బౌల్డ్ చేశాడు. 

నాలుగో స్థానంలో వచ్చిన నికోలస్ పూరన్ (4), షమ్రా బ్రూక్స్ (4), రొవ్మన్ పావెల్  (5) లు విఫలమయ్యారు. దీంతో  పది ఓవర్లకే  విండీస్ కీలక వికెట్లన్నీ కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది.  కానీ  జేసన్ హోల్డర్ (33 బంతుల్లో 38, 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో  కాసేపు ప్రతిఘటించడంతో విండీస్ స్కోరు వంద దాటింది.  అయితే  ఆఖర్లో హోల్డర్ మెరిపించిన మెరుపులు  విండీస్ ఓటమి అంతరాయాన్ని తగ్గించాయే గానీ మ్యాచ్ ను గెలిపించలేదు.  విండీస్ చివరి వరుస బ్యాటర్లు అయిన అకీల్ హోసెన్ (1), జోసెఫ్ (0), ఒడియన్ స్మిత్ (5) కూడా విఫలమయ్యారు.

 

చివరికి హోల్డర్ కూడా షరీఫ్ వేసిన 18వ ఓవర్ మూడో బంతికి  ఔట్ కావడంతో విండీస్ ఇన్నింగ్స్ 118 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా  స్కాట్లాండ్.. 42 పరుగుల తేడాతో గెలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ మూడు వికెట్లు తీయగా.. బ్రాడ్ వీల్, మైఖేల్ లీస్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

ఇక ఈ ఓటమితో వెస్టిండీస్  క్వాలిఫికేషన్ మరింత క్లిష్టంగా మారింది.  గ్రూప్-బిలో ఉన్న విండీస్.. ఇప్పటికే తొలి మ్యాచ్  లో ఓడగా తర్వాత   ఐర్లాండ్, జింబాబ్వేతో జరిగే రెండు మ్యాచ్ లలో తప్పకుండా నెగ్గి తీరాలి. లేదంటే మాజీ ఛాంపియన్స్ కు తిప్పలు తప్పవు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios