మళ్లీ ఓపెనర్లు ఫ్లాప్! సూర్య మెరుపులు చాల్లేదు... పీకల్లోతు కష్టాల్లో టీమిండియా...
మరోసారి నిరాశపరిచిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ... మెరుపులు మెరిపించకుండానే ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెఎల్ రాహుల్ మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కాగా... రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు...
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికి 4 బాదిన కెఎల్ రాహుల్, 5 బంతుల్లో 5 పరుగులు చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఈ దశలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకునే ప్రయత్నం చేశారు. మొదటి 10 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, సామ్ కుర్రాన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.
మంచి టచ్‌లోకి వచ్చినట్టు కనబడిన రోహిత్ శర్మ, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో సామ్ కుర్రాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 28 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన రోహిత్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మరోసారి నిరాశపరిచాడు...
క్రీజులోకి వస్తూనే బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా ఓ సిక్సర్, ఫోర్ బాదాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఆ తర్వాత అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు సూర్య. 10 బంతుల్లో 14 పరుగులు చేసిన సూర్య అవుటయ్యే సమయానికి 12.2 ఓవర్లలో 75 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా...