Asianet News TeluguAsianet News Telugu

వాసన చూసి జెర్సీని గుర్తుపట్టిన రవిచంద్రన్ అశ్విన్... సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో...

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ వీడియో వైరల్... జెర్సీ వాసన చూసి గుర్తు పట్టిన అశ్విన్... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో... 

T20 World cup 2022: Ravichandran Ashwin video goes viral after he identifies jersey with perfume smell
Author
First Published Nov 9, 2022, 10:22 AM IST

క్రికెట్‌లో ప్రతీ రూల్‌కి రవిచంద్రన్ అశ్విన్ దగ్గర సమాధానం ఉంటుంది. మన్కడింగ్ రనౌట్‌ విషయంలో క్రికెట్ ప్రపంచంలో ఒంటరి యుద్ధం చేసిన అశ్విన్, ఓ రకంగా ఐసీసీ స్వయంగా దిగి వచ్చి దాన్ని అధికారికంగా గుర్తించేలా చేశాడు. ఐపీఎల్‌లో రిటైర్డ్ అవుట్‌ని వాడుకుని, ప్రత్యర్థి టీమ్‌కి షాక్ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్... మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు...

ఇండియా, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న సమయంలో వెనకాల అశ్విన్ చేసిన పని టీవీ కెమెరాల్లో రికార్డైంది. గ్రౌండ్ మీద ఉన్న రెండు స్విటర్‌లను తీసుకున్న అశ్విన్, తొలుత వాటి సైజులను చూశాడు. రెండు ఒకే సైజు ఉన్నాయో ఏమో తన జెర్సీని గుర్తు పెట్టేందుకు వాసన చూశాడు. ఒకదాన్ని నేలపై పడేసి, మరోదాన్ని తీసుకుని వెళ్లిపోయాడు...

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై భారత క్రికెటర్ అభినవ్ ముకుంద్ కూడా స్పందించాడు. ‘ఈ వీడియో నేను ఇప్పటికే చాలా సార్లు చూశాను. ప్రతీసారీ నవ్వుతూనే ఉన్నా. డియర్ అశ్విన్, సరైన స్వెట్టర్‌ని ఎంచుకోవడంలో మీ లాజిక్ ఏంటో చెప్పి మాకు జ్ఞానోదయం కలిగించండి...’ అంటూ ట్వీట్ చేశాడు...

ఈ ట్వీట్‌కి రవిచంద్రన్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. ‘సైజులు వేరేగా ఉన్నాయేమోనని చెక్ చేశా... వాడినవేమోనని చూశా... సెట్ కాలేదు. చివరికి నేను వాడిన పర్ఫూమ్‌ వాసనను బట్టి గుర్తు పట్టా... అడేయ్ కెమెరామెన్...’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు అశ్విన్... 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా మారాడు రవిచంద్రన్ అశ్విన్. నాలుగేళ్లుగా భారత జట్టుకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ద్వారా పొట్టి ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా ఐదు మ్యాచుల్లోనూ చోటు దక్కించుకున్నాడు...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చిన అశ్విన్, ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సమయంలో సమయోచితంగా వ్యవహరించి టీమిండియాకి విజయాన్ని అందించాడు. మహ్మద్ నవాజ్ వేసిన బంతిని వైడ్ బాల్‌గా వదిలేసి, పాక్‌కి ఊహించని షాక్ ఇచ్చిన అశ్విన్, ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు...

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో 7 పరుగులు చేసి అవుటైన అశ్విన్, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు...

ఈ మ్యాచ్ తర్వాత అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది. అయితే రోహిత్ శర్మ మాత్రం అశ్విన్‌పై నమ్మకం ఉంచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్ 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాది 13 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు...

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. మొదటి 2.1 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చిన అశ్విన్, ఆ తర్వాత 1.5 ఓవర్లలో 2 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం.. 

Follow Us:
Download App:
  • android
  • ios