పాక్ బౌలింగ్ కు బంగ్లా చిత్తు.. సెమీస్‌కు రూట్ క్లీయర్ చేసుకుంటున్న బాబర్ సేన
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ లో తడబడింది. ఈ టోర్నీలో గ్రూప్-2 నుంచి భారత్ ఇదివరకే సెమీస్ చేరగా.. పాక్-బంగ్లా మ్యాచ్ లో విజేత సెమీస్ కు వెళ్లే రెండో జట్టు అవుతుంది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ సాధ్యమైనంత వరకూ వినియోగించుకుంటున్నది. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓటమితో రేసులోకి వచ్చిన పాకిస్తాన్.. అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బౌలింగ్ లో అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కూల్చి 127 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్ లో పాకిస్తాన్.. 120 బంతుల్లో 128 పరుగులు చేస్తే సెమీస్ చేరినట్టే..
సౌతాఫ్రికా ఓటమితో అనూహ్యంగా సెమీస్ రేసుకు వచ్చిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలపడింది. భారత్ తో మ్యాచ్ లో వీరబాదుడు బాదిన లిటన్ దాస్ (10) ఈ మ్యాచ్ లో మెరవలేదు. కానీ మరో ఓపెనర్ నజ్ముల్ హోసేన్ శాంతో (48 బంతుల్లో 54, 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
వన్ డౌన్ లో వచ్చిన సౌమ్య సర్కార్.. (17 బంతుల్లో 20) ఓ ఫోర్, సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించినా అతడు కూడా త్వరగానే పెవలియన్ చేరాడు. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డకౌట్ అయ్యాడు. మోసాద్దేక్ హోసేన్ (5), నురుల్ హసన్ (0), టస్కిన్ అహ్మద్ (1) లు కూడా దారుణంగా విఫలమయ్యారు. అఫిఫ్ హోసేన్ (20 బంతుల్లో 24 నాటౌట్, 3 ఫోర్లు) చివర్లో కొన్ని మెరుపులు మెరిపించి బంగ్లా స్కోరును 120 దాటించాడు. తొలి పది ఓవర్లలో బంగ్లా 1 వికెట్ కోల్పోయి 70 పరుగులు చేయగా.. తర్వాత పది ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి57 పరుగులు మాత్రమే చేసింది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో ఆ జట్టు ఆశలన్నీ ఇప్పుడు బౌలర్ల మీదే ఉన్నాయి. టస్కిన్ అహ్మద్ అండ్ కో. పాకిస్తాన్ ను ఏ విధంగా నిలువరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం.
ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీ20లలో అతడికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన (4-22). షాదాబ్ ఖాన్ రెండు, హరీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుతో పాటు సౌతాఫ్రికా కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.