బిగ్‌బాష్ లీగ్ సీజన్10లో సిడ్నీ సిక్సర్స్ విజేతగా నిలిచింది. పెర్త్ స్క్రాచర్స్‌పై ఫైనల్ మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచి, వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించింది సిడ్నీ సిక్సర్స్. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

ఫిలిప్ 9 పరుగులకే అవుట్ అయినా జేమ్స్ విన్స్ 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 పరుగులు చేసి సిడ్నీ సిక్సర్స్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హెండ్రిక్స్ 18, క్రిస్టియన్ 20 పరుగులు చేశారు.

189 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన పెర్త్ స్క్రాచర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితమైంది. లియామ్ లివింగ్‌స్టోన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా కామెరూన్ బ్రాంక్రాఫ్ట్ 30 పరుగులు చేశాడు. జేమ్స్ వీన్స్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలవగా జోష్ ఫిలిప్ ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’గా నిలిచాడు.