Asianet News TeluguAsianet News Telugu

మరోసారి శతక్కొట్టిన సూర్యభాయ్... డిసైడర్ మ్యాచ్‌లో శ్రీలంక ముందు భారీ టార్గెట్..

మూడో టీ20లో 228 పరుగుల భారీ స్కోరు చేసిన భారత జట్టు... టీ20ల్లో మూడో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్! 

Suryakumar yadav hits 3rd T20 Century in India vs Sri Lanka 3rd T20I
Author
First Published Jan 7, 2023, 8:40 PM IST

ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్... పొట్టి ఫార్మాట్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. రెండో టీ20లో హాఫ్ సెంచరీ చేసినా కీలక సమయంలో అవుటైన సూర్య భాయ్, డిసైడర్ టీ20లో సెంచరీతో చెలరేగాడు. సూర్యకి తోడు రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగుల భారీ స్కోరు చేసింది భారత జట్టు.. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ 1 పరుగు చేసి దిల్షాన్ మదుశంక వేసిన తొలి ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. 3 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది టీమిండియా...  వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కరుణరత్నే బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది భారత జట్టు స్కోరు 50 మార్కు దాటించిన రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాతి బంతికి మదుశంకకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన రేంజ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో 1500 పరుగులు పూర్తి చేసుకున్నాడు...

సూర్యకుమార్ యాదవ్ 43 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు అందుకోగా విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్, బాబర్ ఆజమ్, కెఎల్ రాహుల్ 39 ఇన్నింగ్స్‌ల్లో మహ్మద్ రిజ్వాన్ 42 ఇన్నింగ్స్‌ల్లో అందుకుని ముందున్నారు..

28 బంతుల్లో 29 పరుగులే చేసిన శుబ్‌మన్ గిల్, క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, వానిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కి 111 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.. 

కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 4 బంతుల్లో 4 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి బంతికి ఫోర్ బాదిన దీపక్ హుడా, మదుశంక బౌలింగ్‌లో హసరంగకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన స్టైల్‌లో బ్యాటింగ్ కొనసాగించాడు.  51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు.

టీమిండియా తరుపున టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో నిలిచాడు సూర్యకుమార్ యాదవ్.. అక్షర్ పటేల్ 9 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేశాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios