ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత కారణాలతో దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు సీఎస్‌కే వైస్ కెప్టెన్ సురేశ్ రైనా.  గుర్తు తెలియని దుండగులు చేసిన దాడిలో రైనా మామ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన రైనా బామ్మర్దులు ఇద్దరు కోలుకోగా, నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఉండేందుకు స్వదేశానికి తిరిగి వచ్చిన సురేశ్ రైనా, తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఆలోచిస్తున్నాడట. ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు పొందిన రైనా, ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 5369 పరుగులు చేశాడు.

5 వేల మైలురాయి దాటిన మొదటి క్రికెటర్ రైనానే. ధోనీతో పాటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన రైనా, ఇప్పుడు మిస్ అయితే మళ్లీ వచ్చే ఏడాది ఐపీఎల్ వరకూ క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. అదీగాక పారితోషికంగా వచ్చే రూ.11 కోట్ల రూపాయలను రైనా మిస్ అవుతాడు.

పరిస్థితులు కాస్త కుదుటపడిన వెంటనే, అంటే మరో వారం రోజుల తర్వాత తిరిగి దుబాయ్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట ‘చిన్నతల’. రైనా రీఎంట్రీ ఇస్తే, సీఎస్‌కె జట్టుకి అదనపు బలం చేకూరుతుంది.