ఇటీవల ఐపిఎల్ సక్సెస్ పుల్ జట్టు చెన్నైని ఓడించిన సన్ రైజర్స్ మరోసారి ఆ జట్టుతో మంగళవారం తలపడనుంది. చెన్నై వేదికగా జరగనున్న  ఈ మ్యాచ్ కు ముందే హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాలతో సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశాని  వెళ్లిపోయాడు. దీంతో చెన్నై మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు. 

విలియమ్సన్‌ నాన్నమ్మ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో ఉన్నపళంగా అతడు స్వదేశానికి పయనమవ్వాల్సి వచ్చింది. దీంతో  ఇప్పటికే జట్టుతో కలిసి చెన్నైకి చేరుకున్న అతడు ఉదయం అక్కడినుండే  న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. అతడు మళ్లీ ఏప్రిల్ 27న రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌ లో అందుబాటులోకి రానున్నట్లు సన్ రైజర్స్ యాజమాన్యం తెలిపింది. 

ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య సన్ రైజర్స్ పర్యటక జట్టు చెన్నైపై ఘన విజయం సాధించింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న తమను అడ్డుకున్న సన్ రైజర్స్ ను మంగళవారం సొంత మైదానంలో జరిగే మ్యాచ్ లో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లోనూ గెలిచి ప్లేఆఫ్ కు మరింత చేరువవ్వాలని హైదరాబాద్ ఆటగాళ్ళు భావిస్తున్నారు.ఇలా ఇరుజట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమయంలో విలియమ్సన్ జట్టుకు దూరమవడం సన్ రైజర్స్ కు పెద్ద లోటేనని చెప్పాలి. 

చెన్నైతో ఇవాళ జరగనున్న మ్యాచ్ కు సన్ రైజర్స్ కెప్టెన్ గా బౌలర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించనున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్లోనే గాయం కారణంగా విలియమ్సన్ జట్టుకు దూరమైన మ్యాచుల్లో భువనేశ్వర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అలాగే మరోసారి ఇప్పుడు కెప్టెన్ బాధ్యతలు చెపట్టనున్నాడు.