నువ్వు ఆ డొక్కు లూనా నడపడం ఆపు.. పుజారా స్లో ఇన్నింగ్స్‌పై రవిశాస్త్రి ఆగ్రహం..
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఓపిక తక్కువ. దీంతో అతడు పుజారాపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని శాస్త్రి కోచింగ్ సిబ్బందిలో భాగంగా ఉన్న ఆర్. శ్రీధర్ తన పుస్తకంలో వెల్లడించాడు.

టీమిండియా నయా వాల్ టెస్టులలో ద్రావిడ్ ను మరిపించడంలో ఎక్స్‌పర్ట్. ద్రావిడ్ మాదిరిగానే భారత జట్టుకు టెస్టులలో కీలకంగా మారాడు పుజారా. ఈ నయా వాల్ ను ఔట్ చేయడానికి బౌలర్లు అలిసిపోతారేమో గానీ పుజారా మాత్రం అంత ఈజీగా పెవిలియన్ కు వెళ్లడు. కీలక మ్యాచ్ లలో అయితే పుజారా ఇన్నింగ్స్ కు ప్రత్యర్థికి అలసట, విసుగు, కోపం అన్నీ రావాల్సిందే. పూజారా ఇన్నింగ్స్ చూసి ప్రత్యర్థికి అలసట వచ్చిందో లేదో గానీ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అయితే ఓ సందర్భంలో విసుగొచ్చిందట.. అసలే శాస్త్రికి ఓపిక తక్కువ. దీంతో అతడు పుజారాపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని శాస్త్రి కోచింగ్ సిబ్బందిలో భాగంగా ఉన్న ఆర్. శ్రీధర్ వెల్లడించాడు.
తన ఆటో బయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్’లో ఇదే విషయం గురించి రాస్తూ.. విరాట్, రవిశాస్త్రిలు పుజారా స్పీడ్ గా ఆడాలని చూసినా అతడు మాత్రం తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడేందుకు యత్నిస్తుండటంతో వాళ్లిద్దరికీ విసుగొచ్చిందట. ముఖ్యంగా శాస్త్రి అయితే ‘నువ్వు ఆ డొక్కు లూనా నడపడం ఆపు...’అని ఆగ్రహం వ్యక్తం చేశాడట. 2019లో విశాఖపట్నం లో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగిందట.
ఆ మ్యాచ్ లో భారత్.. తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయగా రోహిత్ (176) సెంచరీ చేశాడు. తర్వాత సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 431 పరుగులకు ఆలౌట్ అయింది. క్వింటన్ డికాక్, డీన్ ఎల్గర్ లు సెంచరీలు చేశారు. అనంతరం భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో 67 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా వంద (127) రన్స్ కొట్టాడు. రోహిత్ ప్పీడ్ గానే ఆడినా పుజారా మాత్రం డిఫెన్స్ కే ప్రాధాన్యమిచ్చాడు. 61 బంతులాడి 8 పరుగులే చేశాడు. అప్పుడు పుజారా ఆట చూసి చిర్రెత్తుకొచ్చిన శాస్త్రి.. సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ తో పుజారాకు ఓ చీటి పంపాడట. ఆ చీటిలో ‘పుజారా.. నువ్వు ఆ లూనా నడపడం ఆపు. హ్యార్లీ డేవిడ్సన్ మీద వెళ్లడానికి ట్రై చేయి..’అని ఉందని శ్రీధర్ వెల్లడించాడు.
వాస్తవానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ దూకుడుగా ఆడి సఫారీలను ఆలౌట్ చేసి విజయం సాధించాలని చూసింది. కానీ పుజారా అలా ఆడటంతో శాస్త్రికి కోపమొచ్చిందట. అయితే శాస్త్రి చీటి అందుకున్నాక పుజారా గేర్ మార్చాడట. తర్వాత 87 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 148 బంతులలో 87 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో 395 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు.. 191 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఫలితంగా భారత్.. 203 పరుగుల తేడాతో విజయం సాధించింది.