డీఆర్‌ఎస్ తీసుకునే విషయంలో వికెట్ కీపర్ పాత్ర ఎంత ఉంటుందో శ్రీకర్ భరత్‌కి వివరించిన రోహిత్ శర్మ... కెఎల్ రాహుల్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదన్న తెలుగు క్రికెటర్.. 

టీమిండియాలో చోటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు కోన శ్రీకర్ భరత్. అప్పుడెప్పుడో ఏడాదిన్నర క్రితం టెస్టు టీమ్‌కి ఎంపికైన శ్రీకర్ భరత్, రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కించుకున్నాడు...

తొలి టెస్టులో 8 పరుగులు చేసి అవుటైన శ్రీకర్ భరత్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన ఈ తెలుగు కుర్రాడు.. మంచి ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన శ్రీకర్ భరత్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ వికెట్లు వెంటవెంటనే కోల్పోయిన తర్వాత వేగంగా పరుగులు చేసి మెప్పించాడు...

Scroll to load tweet…

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్‌ని స్టంపౌట్ చేసిన శ్రీకర్ భరత్, రెండో ఇన్నింగ్స్‌లో ప్యాట్ కమ్మిన్స్ క్యాచ్ అందుకున్నాడు. రెండో టెస్టులో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ క్యాచులను అందుకున్న శ్రీకర్ భరత్, రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్‌ క్యాచ్ అందుకున్నాడు..

‘‘రోహిత్ భాయ్‌తో నేను చాలా సేపు మాట్లాడాను. ఆయన నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ‘డీఆర్‌ఎస్ తీసుకునే విషయంలో నీ డెసిషన్ బాగుంది. నువ్వు బ్యాటర్‌గా దగ్గరగా ఉంటావు, ఏది అవుట్, ఏది కాదనేది నీకు బాగా తెలుస్తుంది.. కాబట్టి నువ్వు ఏమనుకున్నా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పమని అన్నారు... నువ్వు, నేను, బౌలర్.. ముగ్గురం కలిసి మాట్లాడుకుని డీఆర్‌ఎస్ తీసుకోవాలో లేదో నిర్ణయానికి వద్దాం... ’ అన్నారు...

టీమ్‌లో ఏం జరుగుతుందనే విషయాలను పట్టించుకోకుండా నా ఆటపై దృష్టి పెట్టాలని రోహిత్ భాయ్ భరోసా ఇచ్చారు. వాళ్లిచ్చిన మద్ధతు ఎప్పటికీ మరిచిపోలేను...

రవీంద్ర జడేజా, అశ్విన్ టాప్ క్లాస్ స్పిన్నర్లు. వాళ్ల బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. దేశవాళీ క్రికెట్‌లో 10-12 ఏళ్లుగా ఆడుతున్నా. అయినా బెస్ట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బంది పడక తప్పదు..

ప్రతీ బాల్‌ని ఎదుర్కొనే విషయంలో బ్యాలెన్స్ చూసుకోవాలి. ఏ బాల్ మనవైపు వస్తుందో, ఏ బంతి బయటికి వెళ్తుందో అంచనా వేయడంలో పొరపాటు జరిగితే వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది...’’ అంటూ చెప్పుకొచ్చాడు తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్...

తొలి రెండు టెస్టుల్లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన కెఎల్ రాహుల్, మూడో టెస్టులో ప్లేస్ ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు ‘కెఎల్ రాహుల్ గురించి టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం మీదే అది ఆధారపడి ఉంది. అది నాక్కూడా తెలీదు...’ అంటూ రిప్లై ఇచ్చాడు భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్..