T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో అదరగొట్టేందుకు ఆసియా కప్ లో అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లిన శ్రీలంకకు వరుస షాకులు తాకుతున్నాయి.

ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో పాటు దేశంలో ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో చతికిలపడిన శ్రీలంక.. ఆగస్టులో ముగిసిన ఆసియా కప్ లో అనూహ్య విజయాలు సాధించి గత వైభవాన్ని సాధించే దిశగా అడుగులు వేసింది. అదే ఉత్సాహంతో ఆస్ట్రేలియాకు వచ్చిన శ్రీలంకకు ఆట ఆరంభమైన తొలి రోజే రెండు భారీ షాకులు తగిలాయి. అందులో ఒకటి ‘అర్హత గండం’ కాగా మరొకటి ఆ జట్టు కీలక ఆటగాడు దిల్షాన్ మధుశంక గాయంతో వెనుదిరగడం. 

నమీబియాతో మ్యాచ్ కు ముందు మధుశంక ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అతడు ఈ మ్యాచ్ కు దూరమమ్యాడు. టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక పాల్గొనాలంటే అర్హత సాధించాల్సి ఉంది. గ్రూప్-ఏలో ఉన్న శ్రీలంకకు.. నమీబియాతో పోరుకు ముందు మధుశంక గాయపడటంతో ఊహించని షాక్ తగిలింది. 

ఆసియా కప్ - 2022 ద్వారా లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన మధుశంక.. ఆరు మ్యాచ్ లలో ఆరు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో మధుశంక ఆరితేరాడు. కానీ తాజాగా కాలి గాయం కారణంగా మధుశంక ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గాయమైన వెంటనే మధుశంకను ఆస్పత్రికి తరలించి ఎమ్మారై స్కాన్ చేశారు. దీంతో అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, కొన్ని రోజులు అతడు ఆటకు దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచించారు. దీంతో అతడు నమీబియాతో మ్యాచ్ ఆడలేదు. దీంతో పాటు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడని లంక క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అతడి స్థానాన్ని రిజర్వ్ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న బినుర ఫెర్నాండో భర్తీ చేసే అవకాశం ఉంది. 

Scroll to load tweet…

ఇక గీలాంగ్ వేదికగా నమీబియాతో ముగిసిన క్వాలిఫై రౌండ్ తొలి మ్యాచ్ లో శ్రీలంక.. 55 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేశాడు. ఆ జట్టు బ్యాటర్లలో ఫ్రైలింక్ (44), స్మిత్ (31) రాణించారు. అనంతరం లంక.. 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ దసున్ శనక (29) టాప్ స్కోరర్. భానుక రాజపక్స (20) తప్ప మిగిలినవారంతా దు అలా వచ్చి ఇలా వెళ్లారు. నమీబియా బౌలర్లు సమిష్టిగా రాణించి లంకను నిలువరించారు.

Scroll to load tweet…