SL vs PAK: భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇప్పటికే ఒక వికెట్ కోల్పోయింది. ఈ టెస్టులో నెగ్గాలంటే ఆ జట్టు ఐదో రోజు అంతా ఆడి 419 పరుగులు చేయాల్సి ఉంది. లంకకు 9 వికెట్లు కావాలి.
తొలిటెస్టు ఓడినా శ్రీలంక రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుంది. పాకిస్తాన్ పై అన్ని విభాగాల్లో ఆధిక్యం సాధిస్తూ దూసుకుపోతున్నది. గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ముందు ఏకంగా 507 పరగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో రోజు ఆటలో కూడా లంకదే ఆధిపత్యం కొనసాగింది. భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇప్పటికే ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది. ఈ టెస్టులో నెగ్గాలంటే ఆ జట్టు ఐదో రోజు అంతా ఆడి 419 పరుగులు చేయాల్సి ఉంది.
రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోరు 176 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన లంక.. కరుణరత్నే (61) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. కానీ ధనంజయ డి సిల్వా (109) సెంచరీతో కదం తొక్కాడు. టెస్టులలో అతడికి ఇది 9వ సెంచరీ.
పాక్ పేసర్లు, స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కున్న అతడు.. చివరి వరుస బ్యాటర్ రమేశ్ మెండిస్ (45) తో కలిసి 82 పరుగులు జోడించాడు. దీంతో శ్రీలంక 360 పరుగులకు 8 వికెట్ల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఫలితంగా పాకిస్తాన్ ముందు ఏకంగా 507 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన పాకిస్తాన్ తొలి టెస్టు హీరో అబ్దుల్లా షఫీఖ్ (16) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య వేసిన పాక్ రెండో ఇన్నింగ్స్ 15 ఓవర్ ఆఖరి బంతికి అతడు వెల్లలెగె కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (46 బ్యాటింగ్), బాబర్ ఆజమ్ (26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వెలుతురు లేకపోవడంతో నాలుగో రోజు ఆటను మరో ఐదు ఓవర్ల ముందే ముగించారు.
ఇక ఈ మ్యాచ్ లో పాక్ గెలవాలంటే ఆట చివరి రోజు 419 పరుగులు చేయాల్సి ఉంది. అయితే గాలే పిచ్ చివరిరోజు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలే ఎక్కువ. ఇటీవల ఆస్ట్రేలియాతో రెండో టెస్టుతో పాటు పాకిస్తాన్ తో తొలి టెస్టులో కూడా శ్రీలంక.. ప్రత్యర్థి జట్లను గడగడలాడించింది. దీంతో ఐదో రోజు లంక స్పిన్నర్లు రమేశ్ మెండిస్, ప్రభాత్ జయసూర్యలను తట్టుకుని పాక్ బ్యాటింగ్ ఏ మేరకు నిలబడగలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన లంక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయాలని చూస్తున్నది. ఈ మ్యాచ్ డ్రా అయితే మాత్రం సిరీస్ ను పాక్ 1-0తో నెగ్గే అవకాశముంది.
సంక్షిప్త స్కోరు వివరాలు : శ్రీలంక : 378 & 360/8 డిక్లేర్డ్
పాకిస్తాన్ : 231 & 89/1
