వరుస పరాజయాలు! గాయాలు... వన్డే వరల్డ్ కప్‌లో సీనియర్లను దించుతున్న శ్రీలంక...

మొదటి మూడు మ్యాచుల్లో బోణీ కొట్టని శ్రీలంక.. ట్రావెల్ రిజర్వులుగా ఇండియాకి ఏంజెలో మాథ్యూస్, దుస్మంత ఛమీరా.. 

Sri Lanka called Angelo Matthews and Dushmantha Chameera as travel reserves for ICC World cup 2023 CRA

ఒకప్పుడు టీమిండియా, పాకిస్తాన్‌తో పోటీపడి విజయాలు అందుకున్న శ్రీలంక, ఇప్పుడు అసోసియేట్ దేశాలతో పోటీపడాల్సిన దుస్థితిని ఎదుర్కుంటోంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ నుంచి వచ్చిన నెదర్లాండ్స్ కూడా సౌతాఫ్రికాని ఓడించి బోణీ కొట్టింది. అయితే శ్రీలంక మాత్రం మొదటి మూడు మ్యాచుల్లో విజయాన్ని అందుకోలేకపోయింది..

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో పరాజయం పాలైన శ్రీలంక, ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 344 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే బౌలింగ్ వైఫల్యం కారణంగా ఆ భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. 

మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా కూడా శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో నెగ్గి, బోణీ కొట్టింది. 1996లో వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన శ్రీలంక, 2007 వన్డే వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో వరుసగా ఫైనల్ చేరింది... 2023 వన్డే వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు, క్వాలిఫైయర్స్ టైటిల్ గెలిచింది..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆల్‌రౌండర్, టాప్ స్పిన్నర్ వానిందు హసరంగ గాయపడ్డాడు. గాయంతో ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యాడు హసరంగ. టోర్నీ మొదలైన తర్వాత లంక కెప్టెన్ దసున్ శనక కూడా గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకున్నాడు..

ప్రపంచ కప్‌కి జట్టును ప్రకటించినప్పుడు గాయంతో బాధపడుతున్న దుస్మంత ఛమీరా, పూర్తిగా కోలుకున్నాడు. మాజీ కెప్టెన్, వెటరన్ ఆల్‌రౌడర్ ఏంజెలో మాథ్యూస్ అయితే పేలవ ప్రదర్శనతో వన్డే జట్టులో చోటు కోల్పోయి చాలా కాలమే అయ్యింది..

అయితే వరుస పరాజయాలు, ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతున్న శ్రీలంక జట్టు, ఏంజెలో మాథ్యూస్, దుస్మంత ఛమీరాలను ట్రావెల్ రిజర్వులుగా ఇండియాకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఏ ప్లేయర్ అయినా గాయపడితే అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ ఇద్దరినీ ఇండియాకి రప్పిస్తున్నట్టుగా ప్రకటించింది శ్రీలంక క్రికెట్ బోర్డు..

అక్టోబర్ 21న నెదర్లాండ్స్‌తో లక్నోలో మ్యాచ్ ఆడనుంది శ్రీలంక. ఆ తర్వాత 26న ఇంగ్లాండ్‌తో, 30న ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచులు ఉంటాయి. నవంబర్ 2న టీమిండియాతో ముంబైలో మ్యాచ్ ఆడే శ్రీలంక, నవంబర్ 6న బంగ్లాదేశ్, 9న న్యూజిలాండ్‌తో మ్యాచులు ఆడుతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios