Asianet News TeluguAsianet News Telugu

ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్ ఔట్.. ఫైనల్లో భారత్‌తో లంక అమ్మాయిల అమీతుమీ..

Women's Asia Cup 2022: లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన  ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా   శ్రీలంక.. ఈనెల 15న మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్ తో కీలక మ్యాచ్ ఆడనుంది.  14 ఏండ్ల తర్వాత శ్రీలంక మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్ ఆడనుండటం గమనార్హం.

Sri Lanka Beat Pakistan By 1 Run in Women's Asia Cup 2022, Ready To Face India In Finale in October 15 th
Author
First Published Oct 13, 2022, 5:54 PM IST

మహిళల ఆసియా కప్ లో భారత్ తో ఫైనల్ లో పోటీ పడే జట్టేదో తేలిపోయింది. గురువారం పాకిస్తాన్ తో  చివరి బంతి వరకు  ఉత్కంఠ నడుమ జరిగిన  రెండో సెమీస్ లో  శ్రీలంక ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన  ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా   శ్రీలంక.. ఈనెల 15న మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్ తో షిల్హట్ వేదికగా జరిగిన రెండో సెమీస్ లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 పరుగుల వద్దే ఆగిపోయింది. కాగా..  14 ఏండ్ల తర్వాత శ్రీలంక మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్ ఆడనుండటం గమనార్హం. ఇవాళ ఉదయం భారత్-థాయ్లాండ్ మధ్య జరిగిన మొదటి సెమీస్ లో భారత్ 74 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. కెప్టెన్ ఆటపట్టు (10)  త్వరగానే నిష్క్రమించినా వికెట్ కీపర్ అనుష్క సంజీవని (26), మాదవి (35)  ఫర్వాలేదనిపించారు.  

వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. నీలాక్షి డిసిల్వా (14), హాసిని పెరీరా (13), రణసింఘే (6) లు విఫలమయ్యారు.  పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక.. 20 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేయగలిగింది.  పాక్ బౌలర్లలో నష్రా సంధు 3 వికెట్లు తీయగా.. ఐమెన్ అన్వర్, నిదా దార్, సదియా ఇక్బాల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. 

స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్  కు కూడా షాకులు తప్పలేదు. ఓపెనర్ మునీబా అలి (18), సిద్రా  అమిన్ (9)  విఫలమయ్యారు.  కెప్టెన్ బిస్మా మరూఫ్  (41 బంతుల్లో 42, 4 ఫోర్లు), నిదా దార్ (26 బంతుల్లో 26, 1 ఫోర్)  లు జట్టును విజయ పథం వైపు నడిపించారు.  

 

చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సి ఉండగా అచిని కులసురియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. తొలి బంతికి నిదా దార్ సింగిల్ తీసింది. రెండో బంతికి బైస్ రూపంలో పరుగు రాగా మూడో బంతికి దార్ 2 పరుగులు రాబట్టింది. ఐదో బంతికి కూడా సింగిల్ రాగా.. ఆరో బంతికి   పాక్.. 2 పరుగులు తీయాల్సి ఉండగా  నిదా దార్ రనౌట్ అయింది.  దీంతో లంక ఒక్క పరుగు తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.  

కాగా ఇటీవలే ముగిసిన పురుషుల ఆసియా కప్ - 2022లో కూడా ఫైనల్ పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరుగగా  తుది పోరులో శ్రీలంక అనూహ్య విజయం సాధించి ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ఇక మహిళల ఆసియా కప్ సెమీస్ లో కూడా అదే ఫలితం రిపీట్ అయింది. మరి భారత్ తో ఫైనల్ పోరులో లంక.. హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు షాకిస్తుందా..? లేక ఓడిపోతుందా..? అనేది ఈ నెల 15న తేలనుంది.  

మహిళల ఆసియా కప్ ఇప్పటివరకు ఏడు ఎడిషన్లు ముగియగా.. ఇది 8వ ఎడిషన్. ఈ మెగా టోర్నీలో ఇండియా - శ్రీలంక లు 2004, 2005,  2006,  2008 లో ఫైనల్లో తలపడ్డాయి. ఈ నాలుగు దఫాలు భారత్ నే విజయం వరించింది. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios