SRH vs GT : భారీ వర్షంతో గుజరాత్ తో మ్యాచ్ రద్దు..హైదరాబాద్ కు గుడ్ న్యూస్ !
SRH vs GT : ప్లేఆఫ్ రేసులో హైదరాబాద్ అదృష్టం కలిసివచ్చింది. 13వ మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడకుండానే ప్యాట్ కమిన్స్ జట్టు ప్లేఆఫ్స్ లో చోటు దక్కించుకుంది. మరో రెండు జట్లు ఈ రేసు నుంచి ఔట్ అయ్యాయి.
Sunrisers Hyderabad vs Gujarat Titans : హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఐపీఎల్ 2024 లో ప్లేఆఫ్స్ కు కీలకమైన మ్యాచ్ రద్దు అయింది. దీంతో హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. గ్రౌండ్ కు వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న హైదరాబాద్-గుజరాత్ మ్యాచ్ పై ప్రభావం పడింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయింది అయినా వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కీలక మ్యాచ్ వర్షార్పణం..
ఐపీఎల్ 2024 66వ మ్యాచ్ హైదరాబాద్, గుజరాత్ మధ్య జరగాల్సి ఉంది. అయితే, భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, మరోవైపు రెండు జట్లు ఈ రేసు నుంచి ఔట్ అయ్యాయి. ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా హైదరాబాద్ నిలిచింది. చెన్నై-ఆర్‌సీబీ మ్యాచ్ పై కూడా వర్షం ప్రభావం ఉండనుందని వాతావరణ నివేదికలు బట్టి తెలుస్తోంది.
ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ, సీఎస్కే, ఢిల్లీ
ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే రెండు జట్ల అర్హత సాధించాయి. ఇప్పుడు గుజరాత్ తో మ్యాచ్ రద్దుకావడంతో హైదరాబాద్ మూడో టీమ్ గా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. ఇందులో టేబుల్ టాపర్ కోల్‌కతా కాగా, తర్వాత రాజస్థాన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మూడో స్థానానికి అర్హత సాధించింది. ఆర్‌సీబీ-చెన్నై మధ్య మ్యాచ్ తర్వాత నాలుగో జట్టు ఏదనేది ఖరారు కానుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుకు ప్లేఆఫ్‌కు తలుపులు తెరుచుకుంటాయి.
ఢిల్లీ, లక్నో ఔట్
ఢిల్లీ, లక్నో జట్లు నిరంతరం ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. కానీ వర్షం కారణంగా హైదరాబాద్‌కు ఒక పాయింట్ లభించింది. దీంతో ఢిల్లీ-లక్నో ప్లేఆఫ్ రేసు నుండి దాదాపు నిష్క్రమించినట్టే. ఎందుకంటే ఆ జట్ల రన్ రేటు మైనస్ లో ఉంది. హైదరాబాద్‌కు మరో మ్యాచ్ మిగిలి ఉంది. మే 19న జరిగే లీగ్ రౌండ్‌లో ప్లేఆఫ్‌కు దూరమైన పంజాబ్‌తో హైదరాబాద్ చివరి మ్యాచ్ ఆడనుంది.
మే 21న తొలి క్వాలిఫయర్ మ్యాచ్..
మే 18న ఆర్‌సీబీ-చెన్నై జట్ల మధ్య మ్యాచ్ తర్వాత ప్లేఆఫ్‌కు వెళ్లే నాలుగు జట్ల పేర్లు వెల్లడికానున్నాయి. మే 21న తొలి క్వాలిఫయర్ మ్యాచ్, ఆ తర్వాత మే 22న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్-2 మే 24న జరగనుండగా, ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది.
టీమిండియా ప్రధాన కోచ్ రేసులో దిగ్గజ ప్లేయర్లు.. అప్పుడే రచ్చ మొదలైంది !